దేవుడు సర్వజీవ దయా స్వరూపుడు మరియు సర్వ శక్తిమంతుడు. ఆయన తన బిడ్డలైన మనలను కూడా తనలాగే శక్తిమంతులను చేయుటకు మనులను పుట్టించియున్నాడు. అలా శక్తిమంతులు కావుటకు మానవ దేహము అనే పరికరమును ఇచ్చియున్నాడు అనగా మానవ దేహము ద్వారా తప్ప వేరే ప్రాణుల దేహము ద్వారా మనము ఆ దైవత్వమును పొందలేము.
ప్రజ్ఞానం బ్రహ్మ - ఋగ్వేదం
అహం బ్రహ్మాస్మి - యజుర్వేదం
తత్వమసి - సామవేదం
అయం ఆత్మబ్రహ్మం - అథర్వణ వేదం
మన నాలుగు వేదములు చెప్పియున్న జ్ఞానము పైన ఉదహరింపబడినది. పై వాక్యముల సారము నీవే బ్రహ్మము అనగా మానవుడే దేవుడు. ఆ దైవత్వమును ఏ విధముగా మానవుడు పొందగలడో ఆ సూత్రమును జ్యోతి రామలింగస్వామి వివరించి, తానే బ్రహ్మమై వర్ధిల్లుచూ, మనలను కూడా తాను పొందిన బ్రహ్మత్వమును పొంది నిత్యానందమును అనుభవించుటకు ఆహ్వానించుచున్నారు.
మానవ దేహమునందు పరమాత్మ నివసించుచూ తద్వారా మనము దివ్య మానవులుగా (దైవత్వమును పొంది శక్తివంతులుగా) మారుటకు కారణమై కార్యరూపము గావించుచున్నాడు. ఏ జీవుల హృదయము నందు జీవ దయ విశేషముగా ఉన్నదో, ఆ దేహము నందు పరమాత్మ విశేషముగా కార్యమును ఆచరించుచున్నాడు. దయ లేని దేహమునందు దేవుని కార్యాచరణ జరగదు. దీనినే ఆరుట్పెరుం జ్యోతి ఆగవల్ నందు ఈ క్రింది విధముగా చెప్పియున్నారు.,
" అరుళరియార్ తమ్మై అరియార్ ఎమ్మయుమ్ పొరుళ్ అరియార్ ఎన పుగన్ర మెయ్ శివమే " (993:994)
అనగా, జీవుల యందు దయలేని వారు తమ్ముతాము తెలుసుకొనలేరు, నన్ను (అనగా) దేవుని కూడా తెలుసుకొనలేరు. కావున మనము సర్వ శక్తి పొందు నిమిత్తము, తమ్ము తాము తెలుసుకొనుటకు మరియు పరమాత్మను తెలుసుకొని అంతవారగుటకు జ్యోతి రామలింగ స్వామి వారు తెలిపిన మార్గములో పయనించి సిద్ధి పొందుటకు ప్రయత్నించెదము .