ధర్మము విఫలమై, ప్రపంచమున చెడు ప్రబలినపుడు, దానిని నిర్మూలించి ధర్మ రక్షణ చేయుటకు భగవంతుడు అవతరించడం లేక మానవ రూపములతో ప్రత్యక్షమై ధర్మ రక్షణ గావించి అద్రుశ్యమవడం జరుగును. ఇది అన్ని మత గ్రంధములు మరియూ పురాణములలో చెప్పబడి ఉన్నది. మరోవైపు మానవుల యొక్క దుఃఖాన్ని వారి దురభిప్రాయములను మార్చి ఆ భగవంతుడిని చేరుకొనుటకు గల దారిని చూపుటకు ఎందరో మహర్షులు, దివ్య పురుషులు జన్మించి మార్గ దర్శనములు చేయుచున్నారు. కానీ వారి వారి సామర్థ్యానికి అనుగుణంగా కొందరు అక్కడితో ఆగిపోయి మరికొందరు అక్కడితో వారి ప్రయాణమును నిలుపుకొని ఉన్నారు. వారి అనుచరులు వారి గురువులు నిర్దేశించిన మార్గమును అనుసరించుచూ మానవాళికి అనిశ్చితివైపుకి దారి చూపుచున్నారు. శరీరము శాశ్వతము కాదు, భగవంతుడిని చేరుకొనుటకు శరీరమును వదలవలెను అనే అభిప్రాయమును కలిగి ఉండుటయే దీనికి కారణము.
కానీ నిజము భిన్నంగా ఉంటుంది. భగవంతుడు శాశ్వతమైనవాడు. అతని ఉనికి ప్రపంచమంతటా ప్రతి అణువులోనూ వ్యక్తీకృతమై ఉన్నది. మన భౌతిక శరీరము ఆకాశము, భూమి, అగ్ని, నీరు మరియూ వాయువు అను పంచ భూతముల యొక్క మూలకముల ఫలితమే. అట్టి భౌతిక శరీరములోనే భగవంతుని ప్రాభల్యమును సంపూర్ణముగా తెలుసుకొనగలము. మంచి, చెడుల మధ్య గల బేధమును గుర్తించి ఉన్నత జీవితమును జీవించుటకు కావలసిన తార్కిక మనస్సు మానవునికి తప్ప మరి ఏ జీవి కి లేదు.
ఇందు మూలముగా మానవ శరీరములోనే ఆ భగవంతుని రూపము సాకారమై మరియూ దాని పర్యవసానముగా దైవ అనుగ్రహము పొంది మానవుడు నిత్యము జీవించగలడు. ఈ సూత్రము సాధారణముగా కనిపించినప్పటికీ, ఇంకా మానవాళి మరణమును జయించి నిత్య జీవితము పొందుటకు కావలసిన పరిపక్కువతను పొందలేదు. ఇందుకు ప్రధాన కారణము మానవుడు సరియైన మార్గమును ఎంచుకొనలేదు మరియూ ఆ పరిస్థితులవైపు అతనిని నడిపించి మార్గ నిర్దేశము చేయుటకు ఎవరూ లేరు. ఇప్పటి వరకు మానవుడు భగవంతుడిని భౌతిక శరీర స్థాయి నుండే వీక్షించుచూ తాను భగవంతుడి నుండి వేరు చేయబడి ఉన్నాడని నమ్ముతున్నాడు. దీర్ఘ కాలములో భగవంతునిలో లీనమై అతని లక్ష్యమును చేరుకోనవచ్చని నిరీక్షించుచున్నాడు.
దాదాపు అన్ని మతములు మానవుడు మరియు దైవము వేరు అనే ద్వైత సిద్దాంతమునే ప్రభోదించుచున్నది. ఆత్మ, భగవంతుడు మరియు భాగముల (శరీరము మరియూ ప్రపంచము) గురించిన నిజమైన జ్ఞానము లేక మనము అజ్ఞానాంధకారములో సంచరించుచున్నాము.
అందువలన జీవితము యొక్క పరిపూర్ణత అంతరాంతరముల నుండి వచ్చునని తెలుసుకొనుచున్నాము. ప్రపంచము దీనిని ఒక కొత్త సిద్ధాంతముగా కనుగొనవచ్చు. కానీ ఇది సత్యము. మతము పేరుతో, సమాజము మత ఘర్షణలు, మత యుద్ధములు మరియు కుల వ్యవస్థ లోకి లోతుగా పాతుకు పోయింది. ఇది సత్యమును గ్రహించుటకు కష్టసాధ్యము చేసినది.
అతి కష్టముల మధ్య మరణమును జయించి అమరత్వ నిత్య జీవితమును అందరికి సుసాధ్యము చేసి దానిని భగవంతుని చిత్తముగా స్థాపించి సర్వ మానవాళికి ఇది సాధ్యమే అని చాటి చెప్పిన ఒక మహోన్నత వ్యక్తి, దివ్య పురుషుడు శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారి గురించి తెలుసుకొనుచున్నాము. విధిని మించిన శక్తి లేదని ప్రపంచమంతయూ నమ్ముచున్నది. మరణమను విధిని జయించలేమని నమ్ముచున్నది.
ఇప్పుడు ఈ లోతైన నమ్మకము తిరస్కరించబడి మానవుడు మరణమును జయించి నిత్య జీవితము పొందుటకు సమయము ఆసన్నమైనది.
No comments:
Post a Comment