కృప/ అనుగ్రహము అనునది భగవంతుని దయ, దేవుని సహజ సిద్ధ స్వరూపము. జీవకారుణ్యమనునది జీవుల యొక్క దయ., అనగా జీవాత్మ యొక్క సహజ సిద్ధ స్వరూపము. అందువలన దయ ద్వారానే దయను అనగా జీవుల సహజ స్థితి అయిన జీవకారుణ్యము ద్వారానే భగవంతుని సహజ స్థితి అయిన ఆయన అనుగ్రహమును పొందగలము.
జీవకారుణ్యము ద్వారా మాత్రమే భగవత్ కృపను పొందవచ్చును. కావున జీవకారుణ్య సచ్ఛీలతయే జ్ఞానమార్గము మరియు సన్మార్గము అని గ్రహించవలెను.
జీవుల యొక్క సహజ స్వభావమగు దయ, మరియు భగవంతునిచే సృష్టింపబడిన అన్ని జీవులు సహోదరత్వమును కలిగి ఉండుటయే జీవులకు జీవుల పట్ల కలుగు దయకు ఆధారముగా ఉన్నది.
జీవులు ఆకలి, దాహము, అనారోగ్యము, కోరికలు, పేదరికము, భయము, మరియు ప్రాణభయముతో బాధపడుతున్నాయని తెలిసినా, చూసినా, వినినా ఆత్మ ద్రవించును. అనారోగ్యము మరియు కోరికలు ఉన్నప్పటికీ జీవులు ఎక్కువ కాలము జీవించుటకు సాధ్యము కలదు. కానీ, ఆకలి మరియు ప్రాణాపాయ స్థితులను వెంటనే నివారించనిచో ఆ జీవి ప్రాణాలను కోల్పోవును.
ఆకలి మరియు ప్రాణాపాయముల వలన కలుగు బాధ ఒకే విధముగా ఉండును. కావున ఆకలి మరియు ప్రాణాపాయములకు గురికాకుండా ఆ బాధను నివారించుటయే జీవకారుణ్య సచ్ఛీలత యొక్క ప్రధాన లక్ష్యము.
ఒక జీవి ఆకలితో ప్రాణాలను కోల్పోవును అని తెలిసిన వెంటనే, ఆకలిని తీర్చి ఆ ప్రాణాలను కాపాడుటకు జీవకారుణ్యమును అనుసరించువారు ఇతర జీవులను ప్రాణాపాయ స్థితి నుండి కాపాడుటకు వెనుకాడరు.
ఆకలి బాధ
జీవులకు ఆకలి అధికమైన కాలములో
1. జీవజ్ఞానము వికసించక మసకబారును - అది మసకబారినపుడు, జ్ఞానము అనే భగవత్ శక్తి అదృశ్యమగును - అది మరుగైనపుడు పురుషతత్వము కృశించును - అది కృశించినపుడు ప్రకృతి తత్వము మసకబారును - అది కనపడనపుడు గుణములు మార్పుచెందును - మనస్సు స్థిరత్వమును కోల్పోవును - బుద్ధి చెడుతుంది - చిత్తము కలత చెందును - అహంకారము నశించును, ప్రాణాంతకమగును - దేహములోని పంచ భూతములు బాధింపబడును - వాత, పిత్త, శ్లేష్మములు తమ స్థితిలో మార్పు చెందును.
2. కళ్ళు మసకబారి చూపును కోల్పోవును. చెవులు వినికిడి శక్తిని కోల్పోవును - నాలుక ఎండిపోవును.
3. చర్మము సన్నగిల్లి స్పర్శను కోల్పోవును - కాళ్ళు చేతులు శక్తీ హీనమై తడబడును - వాక్కు యొక్క ధ్వని మార్పు చెంది మాటలు తడబడును.
4. మలజల మార్గములు నీరసించును - శరీరము నల్లబడును - రోమములు నిక్కబొడుచుకొనును - నరములు మెత్తబడును - నాడులు తమ సహజత్వమును కోల్పోవును - ఎముకలు నల్లబడి కీళ్లన్నియు ధృఢత్వమును కోల్పోవును - గుండె దడదడలాడును - మెదడు కృశించును - శుక్లము ఎండిపోవును - కాలేయము ద్రవించును - రక్తము మరియు నీరు ఇంకిపోవును - మాంసము మెత్తబడి తన సహజత్వము చెడును - కడుపు భగభగ మండును - కోపతాపములు ఎక్కువగును. ప్రాణము వదిలిపోవుటకు చెరువుగానున్న అన్ని సంకేతాలు కనబడును.
ఆకలి వలన ఇన్ని అవస్థలు జీవులన్నింటికీ ఒకే విధముగా వుండును.
1. ఆకలి అనే అగ్ని పేదవారి శరీరమును చుట్టుముట్టి మండునపుడు వారికి ఆహారము ఇచ్చి ఆ అగ్నిని చల్లార్చుటయే - జీవకారుణ్యము.
2. ఆకలియను విషపూరితమైన గాలి పేదవారి జ్ఞానమనే దీపమును ఆర్పు తరుణములో ఆహారము ఇచ్చి ఆరకుండనట్లు చూచుటయే - జీవకారుణ్యము.
3. భగవంతుని అంశమై వెలసే దేహములనే ఆలయములు, ఆకలివలన పాడుబడునపుడు ఆహారము ఒసగి ఆ ఆలయములను వెలయునట్లు చేయుటయే - జీవకారుణ్యము.
4. భగవంతుని అనుగ్రహము పొందు నిమిత్తము, దేహములోని జీవుడు, ఆకలివలన తమ స్థితిగతులను కోల్పోయి నశించునపుడు, ఆ జీవికి ఆహారము ఇచ్చి స్థిరముగా ఉండునట్లు చేయుటయే జీవకారుణ్యము.
5. ఆకలియనే పులి పేదల యొక్క ప్రాణముల పైకి దూకి చంపు సమయములో ఆ పులిని చంపి ఆ ప్రాణములను కాపాడుటయే జీవకారుణ్యము.
6. నడిచి నడిచి కాళ్ళు జీవములేక, అడిగి అడిగి నాలుక తడబడి, తలచి తలచి మనస్సు చలించి నిర్వీర్యమై ఈ కడుపును ఏమి చేయగలము అని కన్నీరు కార్చే పేదలకు ఆహారము ఒసగి ఆ కన్నీటిని తుడుచుటయే జీవకారుణ్యము.
7. రోజు గడిచినది - ఆకలి బాధించుచున్నది. వేరు ప్రదేశములకు వెళ్లి అడుగుటకు సిగ్గుగా ఉన్నది. నోరు తెరచి అడుగుటకు మానమర్యాదలు అడ్డుపడుచున్నవి. కడుపు మండుచున్నది, ప్రాణము విడుచుటకు ఉపాయము తెలియకున్నది. ఈ జన్మ ఎందుకు? అని మనస్సు, ముఖము వాడిపోయి, వివరించుటకు మాటలు రాక, స్వప్నముగన్న మూగవారివలె మనస్సునందు మధనపడే మానస్థులైన జీవులకు ఆహారము ఇచ్చి వారి మానమును కాపాడుటయే జీవకారుణ్యము.
8. గత జన్మలో మనము, ఆకలిగా ఉన్నవారి ఆకలిని తెలుసుకొని ఆ ఆకలిని తొలగించియున్న, ఈ జన్మలో మన ఆకలి తెలుసుకొని ఆ ఆకలి తీర్చుటకు వేరొకరు ఉండేవారు. ఆ జన్మలో మనము చేయలేదు అని ఈ జన్మలో మనకు బాధ తీర్చేవారు లేదని అర్థము చేసుకొని, నిద్ర రాక దుఃఖించే పేద జీవులకు ఆహారము ఒసగి దుఃఖమును పోగొట్టి నిద్రించేలా చేయుటయే జీవకారుణ్యము.
9. దేహములోని అన్ని నరములు పైకి కనపడగా, ఆకలి వలన కృశించి, స్పృహతప్పే కాలములోనూ అన్యులను అడుగుటకు మనస్సు రాక ఆలోచన చేసి చేసి అగ్నిలో పడుకొని నిద్రించువారిలాగా, పొత్తికడుపులో జఠరాగ్నిని ఉంచుకొని పడుకొనే వివేకవంతులకు ఆహారము ఇచ్చి ఆ జఠరాగ్నిని ఆర్పుటయే జీవకారుణ్యము.
10. కళ్ళు, చేతులు, కాళ్ళు మొదలైన అన్ని అంగములు ఎటువంటి వైకల్యము లేకుండా ఉండి ఆహారము సంపాదించుకొనే శక్తికలిగిన వారే ఇలా బాధపడుచూ పడుకొని ఉన్నారు - మరి గుడ్డి, చెవుడు, మూగ మరియు అంగహీనులుగా ఉన్న మనకు ఆహారము ఏ విధముగా లభించును? - ఆకలి ఏ విధముగా తొలగును? అని పలు విధములుగా అలోచించి దుఃఖించు పేద వారికి ఆహారము ఇచ్చి వారి దుఃఖమును తొలగించుటయే జీవకారుణ్యము.
11. ఆకలితో బాధపడువారు ఏ దేశమువారైననూ, ఏ మతమునకు చెందినవారైననూ, ఏ జాతివారైననూ, ఏ కృత్యములు చేయువారైననూ, వారి వారి జాతి, మత, దేశ, కృత్యములను గురించి ఆలోచించకుండా అన్ని జీవులయందు ఉన్న భగవంతుని అంశము ఒక్కటై ఉండుటవలన వారి ఆకలిని నివారించుటయే జీవకారుణ్యము.
"జీవకారుణ్యమే మోక్షగృహమునకు తాళపుచెవి"
జీవకారుణ్యమనే మోక్ష గృహము యొక్క తాళపుచెవిని సకాలములో సంపాదించుకొన్న గృహస్థులు - చర్య, క్రియ, యోగము, జ్ఞానము మొదలైన సాధనములను ఆశించక, ఏ కాలములోనూ పొందలేని మోక్షగృహము యొక్క తలుపులు తెరుచుకొని లోనికి వెళ్లి నిత్య ముక్తులుగా జీవించెదరు.
1. పుణ్యభూములను ప్రదక్షిణము చేయుట, 2. పుణ్యతీర్థములందు స్నానమాచరించుట, 3. పుణ్యక్షేత్రములలో నివశించుట, 4. పుణ్యమూర్తులను దర్శనము చేయుట 5. స్తోత్రము చేయుట, 6. జపములుచేయుట, 7. వ్రతములు చేయుట, 8. యోగములు చేయుట 9. పూజలు చేయుట మొదలైన చర్యక్రియలను చేసే భక్తులు నిద్ర ఆహారములను వీడి, విషయ వాసనలను తొలగించి ఇంద్రియములను కట్టడి చేసి మనోలయము చేసి యోగము చేయు యోగులు, అనంతమైన శక్తులను పొందిన సిద్ధ పురుషులు, అన్ని బంధములను వీడి బ్రహ్మానందమును పొందిన జ్ఞానులు, జీవకారుణ్యమనే తాళపుచెవిని సంపాదించుకోకుంటే, మోక్షమనే ఉన్నత గృహ సమీపమునకు చేరి వేచియుండి తిరిగి ఆ తాళపు చెవిని సంపాదించుటకు ఇక్కడికి వచ్చెదరు కానీ ఆ మోక్షావాకిలి తెరచుకొని లోనికి వెళ్లి జీవించలేరని సత్యప్రమాణముగా తెలుసుకొనవలెను.
అందువలన జ్ఞానము కలిగిన జీవులందరికీ 'జీవకారుణ్యమే భగవంతునికి చేయు ఆరాధన' అని గ్రహింపవలెను.
జీవకారుణ్య సచ్ఛీలత లేకుండా జ్ఞానము, యోగము, తపము, వ్రతము, జపము మొదలైనవి చేయువారు, భగవంతుని కృపాకటాక్షములను లేశ మాత్రమైననూ పొందలేరు. వారిని ఆత్మ దర్శనము పొందినవారుగా తలచుకొనరాదు. జీవకారుణ్యము లేకుండా చేసే కార్యములన్నియు ప్రయోజనము లేని మాయాజాల కృత్యములు అని తెలుసుకొనవలెను.
1. కాగా, కుష్టు మొదలైన తీరని వ్యాధులతో బాధపడే సంసారులు, తమ తాహతకు తగిన విధముగా ఆకలిగొన్న వారి ఆకలితీర్చుటను వ్రతముగా అనుసరించినచో వారి జీవకారుణ్య అనుసరణ మంచి ముందులాగా వారి వ్యాధులను నివారించి, విశేష సోఖ్యమును కలిగించును.
2. చాలా కాలముగా సంతానము లేక పలురకములైన వ్రతములు ఆచరించి బాధపడుచున్న గృహస్థులు, తమ తాహతకు తగిన విధముగా ఆకలిగొన్న వారి ఆకలి తీర్చుటయే వ్రతముగా ఆచరించిన, ఆ జీవకారుణ్య అనుసరణ వారికి మంచి జ్ఞానము కలిగిన సంతతిని కలిగించును. ఇది సత్యము.
3. అల్పాయుష్కులని విచారించి తెలుసుకొని మరణించుటకు భయపడి విచారించే గృహస్థులు తమ తాహతకు తగిన విధముగా ఆకలితో బాధపడే దీనుల ఆకలిని పోగొట్టుటను వ్రతముగా ఆచరించినచో ఆ జీవకారుణ్య అనుసరణ వారికి దీర్ఘాయుష్షును కలిగించుననునది సత్యము.
4. విద్య, జ్ఞానము, సంపద, భోగము మొదలైన వాటి కోసం బాధపడే గృహస్థులు, తమ తాహతుకు తగిన విధముగా ఆకలితో ఉన్న పేదల ఆకలిని పోగొట్టుటయే వ్రతముగా అనుసరించిన, ఆ జీవకారుణ్య అనుసరణ విద్య, జ్ఞానము, సంపద, భోగము మొదలైన వాటిని కలిగించును. ఇది సత్యము.
5. ఆకలితో బాధపడేవారి ఆకలి తీర్చుట అను వ్రతమును ఆచరించు గృహస్థులను వేసవికాలములో ఎండవేడిమి బాధించదు. భూమి కూడా వేడిని కలిగించదు; పెద్ద వర్షము, ఘనమైన గాలి, పెద్ద పిడుగు, మహాగ్నికీలలు మొదలైన ఉత్పాదకాలు దుఃఖమును కలిగించదు. విషగాలి, విషజ్వరము మొదలైన అసాధారణ వ్యాధులు కలుగదు; ఆ జీవకారుణ్యము కలిగియున్న గృహస్థులు వరదలవల్లనూ, దొంగలవలననూ, శత్రువులవలనను కలతచెందరు; రాజులవలనను, దేవతలవలననూ అవమానింపబడరు.
జీవకారుణ్యము గల సంసారుల భూములలో మిక్కిలి ప్రయాస లేకయే అథిక పంటలు పండి సస్యశ్యామలముగా ఉండును. వ్యాపారములో ఏ ఆటంకము లేకుండా లాభములు వచ్చును. ఉద్యోగములో బాధలు లేకుండా ఉన్నతమైన స్థితి కలుగును. వారి చుట్టూ బంధువులు, సేవకులు ఉందురు. దుష్టమృగములవలననూ, దుష్ట జంతువులవలనను, దుష్ట పిశాచముల వలనను, దుష్ట దేవతలవలనను భయముచెందరు .
జీవకారుణ్యము గల గృహస్థులకు ఎటువంటి ఆపదలు అజాగ్రత్తవలనను, ప్రారబ్ధమువలనను సత్యప్రమాణముగా కలుగదు.
ఆకలిగొన్న వారి ఆకలితీర్చి సంతోషము కలిగించే జీవకారుణ్య సచ్ఛీలత అను మేలైన వ్రతము - దేవతలు, మనుష్యులు, బ్రహ్మచారులు, గృహస్థులు, తపోధనులు, సన్యాసులు, పురుషులు, స్త్రీలు, ముసలివారు, యవ్వనములో ఉన్నవారు, అన్ని జాతులవారు పాటించవలెను అనుట భగవంతుని ఆజ్ఞ అని తెలుసుకొనవలెను.