పురుషార్థములు – 4
శుద్ధ సన్మార్గములో మనము పొందవలసిన పురుషార్థములు 4. అవి,
1. హేమ సిద్ధి (దేనినైనా స్వర్ణముగా మార్చగల శక్తీ; భౌతిక దేహమును సైతం)
2. అమర విద్య (మరణమును జయించుట)
3. తత్వ నిగ్రహము (36 తత్వములను మరియు వాటి 60 తాత్వికములను జయించుట)
4. భగవంతుని స్థితిని గ్రహించి, మనమూ ఆ స్థితిని పొందుట.
సచ్ఛీలత - 4
పై చెప్పబడిన పురుషార్థములను పొందుటకు పాఠించవలసిన సచ్ఛీలతలు 4. అవి,
1. ఇంద్రియ సచ్ఛీలత
2. కరణ సచ్ఛీలత
3. జీవ సచ్ఛీలత
4. ఆత్మ సచ్ఛీలత
1. ఇంద్రియ సచ్ఛీలత
ఇంద్రియములు 2 రకములు. కర్మేంద్రియములు మరియు జ్ఞానేంద్రియములు.
చెడు మాటలు చెవిన పడకుండా నాదము మొదలైన స్తోత్రములను వినవలెను.
అశుధ్ధ స్పర్శ లేకుండా దయతో స్పర్శించవలెను.
క్రూరముగా చూడరాదు.
రుచిని ఆశించరాదు.
సుగంధములను కోరరాదు.
మంచి మాటలు పలుక వలెను.
అసత్యములను పలుకరాదు.
జీవహింస జరుగునపుడు, ఏ విధమైన తంత్రముతోనైననూ దానిని నివారించవలెను.
మహానుభావులు, మహర్షులు, యోగులు నివసించిన (పుణ్యక్షేత్రములు, జీవ సమాధులు మొదలైనవి)ప్రదేశములను దర్శించవలెను.
జీవ ఉపకారమునకై సాధువులు నివశించు స్థలములలో సంచారము చేయవలెను.
మలజలములను క్రమబద్ధీకరించుకొనవలెను (తక్కువ ఎక్కువ కాకుండా). అది ఎటులననగా, మిత ఆహారము, మిత భోగములతో క్రమబద్ధీకరించుకొనవలెను. ఒక వేళ కాల బేధముతో కానీ, ఉష్ణ బేధముతో కానీ క్రమము తప్పినపుడు ఔషధములు, భౌతిక మూలములు, చరబేధ హస్తస్పర్శ తంత్రము వలన కానీ, మూలాంగ ప్రణవ ధ్యాన సంకల్పము చేత కానీ, క్రమము తప్పకుండా చేసుకొనవలెను.
శుక్లమును అక్రమ, అధిక్రమములో వదలకుండా ఉండవలెను. (ఇందులో తీవ్రతరము, ఏ విధముగానైననూ శుక్లమును బయటకు వదలకుండుట)
ఎల్లప్పుడూ దేహమును కవచముతో (వస్త్రముతో) కప్పి ఉండవలెను. ఇలా తల, ఛాతి, నడుముకు క్రింది భాగము మొదలైన వాటిని కప్పి ఉంచవలెను.
బయట నడిచే సమయములో తప్పకుండా కాలికి పాదరక్షలు ధరించవలెను.
మాసిన వస్త్రములను ధరింపకుండుట మొదలైనవి ఇంద్రియ సచ్ఛీలతలు.
2. కరణ సచ్ఛీలత
సత్యమైన పరబ్రహ్మ ఒక్కడే అని సత్య సంకల్పము చేసుకొనవలెను.
చిత్ సభనందు మనస్సును లగ్న పరచుట. అది కాక మరి ఏ చోటనూ మనస్సును సంచరింపచేయక చిత్ సభనందు అనగా భగవంతునియందు మనస్సును లగ్నపరచవలెను.
జీవ దోషములను (అనగా ఇతరుల తప్పులను) విచారించరాదు.
చెడు విషయములలో మనస్సును లగ్నపరచరాదు.
నేను అన్న అహంభావము, తనను తాను గొప్పవానిగా తలచుట మొదలైన వాటిని నిర్మూలించవలెను.
వికృత గుణములవలన కలిగిన చెడుని నిర్మూలించి, ప్రకృతియైన సత్వములో ఉండవలెను.
ఇతరుల పట్ల ఆగ్రహింపరాదు.
తమ శత్రువులైన తత్వములు - అరిషడ్వర్గములపై ఆగ్రహించి వాటిని తొలగించవలెను.
3. జీవ సచ్ఛీలత
ఆడ, మగ మొదలైనవారి అందరిపట్లనూ జాతి, కులము, మతము, ఆశ్రమము, సూత్రము, గోత్రము, శాస్త్రము, దేశమార్గము, పేద, ధనిక అను భేదములు లేక, అందరినీ తమవారి వలె సమానముగా భావించుట.
4. ఆత్మ సచ్ఛీలత
84 లక్షల యోనిబేధము గల జీవుల సూక్ష్మములో ఉన్నది ఆ భగవంతుడేనని గ్రహించి, ఆ జీవుల ఆత్మయే భగవంతుడు కొలువైన దివ్య సభగా, అందులోని ప్రకాశమే పతి (భగవంతుడు) గా చూచి, ఏ విధమైన బేధము లేక అన్నీ తానే అయి ఉండుట.
ఈ విధముగా ఉండినపుడు, పై చెప్పిన దివ్య పురుషార్థములు కైవశమగును. ఏకత్వము అనునది తన జ్ఞానముతో సచ్ఛీలత కలిసి ఒక్కటైనప్పుడు, తనంతటతానే కలుగును. ఇతర సమయములలో, తన వల్ల ఇతరులకు హింస కలుగకుండా, వారు హింసించిననూ తాను సహించి ఉండవలెను.
పై చెప్పబడిన 4 సచ్ఛీలతలలో మొదటి రెండూ మానవ ప్రయత్నము వల్ల సాధ్యము కాగా, క్రింది రెండు, దైవానుగ్రహము వల్లనే సాధ్యమగును.
No comments:
Post a Comment