Thursday, March 24, 2022

వాళ్ళలార్ అనుగ్రహించిన మహోపదేశము


శ్రీముఖ సం|| ము ఆశ్వయుజ మాసము 7 వ రోజు బుధవారము పగలు 8:00 గం|| కు మేట్టుకుప్పం లోని సిద్ధివళాగ భవనము నందు మొట్టమొదటి సారిగా సన్మార్గ పతాకమును ఆవిష్కరించినపుడు జ్యోతి రామలింగ స్వామి వారు ఉపదేశించిన మహోపదేశ సారము. 


అందులోని ప్రధాన అంశములు:


1. సత్విచారము 

2. ఆత్మ సాక్షాత్కారమునకు అడ్డుగా ఉన్న అజ్ఞాన తెరలను తొలగించుట 

3. దయ


1. సత్విచారము 


ఇక్కడున్న మీరందరూ ఇంతకు మునుపు వలె కాలమును వృధా చేయకండి. ఇది మొదలు శాలకు (ధర్మశాలకు), భగవంతుడు వచ్చు  10 దినములు అనగా కొంత కాలము వరకు మీరందరూ మంచి విచారణలో నిమగ్నులై  ఉండండి. ఆ విచారణ ఏమనగా, మనము మన యొక్క స్థితి ఎటువంటిది? మనకు అధిష్టానమైన భగవంతుని స్థితి ఎటువంటిది? అని విచారణ చేయవలెను. దానికి తగినట్లుగా మీరందరూ కలిసి గానీ లేక వ్యక్తిగతముగా గానీ మీ జ్ఞానమునకు, సంస్కారమునకు తగినట్లు ఉన్నవారితో కలిసి యైనను విచారణ చేయవలెను. 


సదరు సత్విచారము - పరము, అపరము అని రెండు విధములైయున్నవి. అందులో పరము అనునది పరలోక విచారము. అపరము అనునది ఇహలోక విచారము. వీటిలో ఇహలోక విచారము అనునది విచారము కాదు. సాధారణముగా ఒకడు విచారించుచున్నాడు అనిన అట్టి విచారము నిజమైన విచారము కాదు. ఎందుకనగా విచారము అనుటకు అర్థము వి - చారము లో (వి) సాధారణ లౌకిక విచారమును పోగొట్టుటకు వచ్చినది అని భావింపవలెను. కావున అది పరలోక విచారమును సూచించదు. వి - చారము యొక్క నిజమును గ్రహించక విచారము అనే పదమును దుఃఖమునకు సంకేతముగా వాడుచున్నాము. కానీ మనము ప్రాపంచిక అర్థమును తీసుకొనరాదు. అది తప్పు. 


చారము అనగా దుఃఖము. విచారము అనగా దుఃఖమును పోగొట్టునది (దుఃఖనివారణము). వి' అనునది ఉపసర్గము. చారము అను దుఃఖమును పోగొట్టునది విచారము. కనుక సత్విచారము అనునది ఇహలోక విచారమునుగాక పరలోక విచారమును మాత్రమే సూచించును. కావున మనము నిరంతరము విచారణా తత్పరులుగా ఉండవలెను. 


సత్విచారము రెండు రకములుగా ఉన్నది. అవి, 

1. అండ విచారము 

2. పిండ విచారము


1. అండ విచారము: 


విశ్వములో (అండము) సూర్యుడు, చంద్రుడు, నక్షత్రముల గురించి అనగా అవి ఏమి? వాటి స్వరూప స్వభావములు ఎటువంటివి? అను విషయముల గురించి ఆలోచన చేస్తూ ఉండవలెను. 


2. పిండ విచారము: 


దేహములో (పిండము) మనము ఎవరు? (నేను ఎవరిని?) ఈ దేహములో కళ్ళు, భ్రూమధ్యములు, చేతులు, మరియు ఇతర భాగములు, వాటి యందు కొన్నింటికి  రోమములు కలుగుట మరి కొన్నింటికి అనగా అరచేయి మొదలైన భాగములలో రోమములు కలుగకుండుట ఏ విధముగా జరుగుతున్నది? కాళ్ళు, చేతుల వ్రేళ్ళలో గోళ్లు ఎందుకు, ఎలా వచ్చుచున్నది? ఈ రకముగా ఇతర అన్ని అవయవముల తత్వములను స్వరూప రూప స్వభావములను గురించి విచారము చేయవలెను.


2. ఆత్మ సాక్షాత్కారమునకు అడ్డుగా ఉన్న అజ్ఞాన తెరలను తొలగించుట:


మీరు ఈ విధముగా సత్విచారము చేస్తూ ఉన్న యెడల, ఆత్మసాక్షాత్కారమునకు అడ్డుగా ఉన్న పలు అజ్ఞానపు తెరలలో ముఖ్యమైనది, గాఢమైనది మరియు మొదటిది అయిన పచ్చని తెర ముందుగా తొలగును. ఆ మొదటి తెర తొలగిన పిమ్మట మిగిలియున్న తెరలు ఒక్కొక్కటిగా తొలగిపోవును. ఆ పచ్చ వర్ణము ఎటువంటిది అనగా నల్లని వర్ణముకు ప్రథమమైనది ఆ పచ్చ వర్ణము. నల్ల వర్ణమును ఎక్కువగా ప్రభావితము చేయునది పచ్చ వర్ణమే. 


ఇటువంటి గాఢమైన తెర (పచ్చ తెర) తొలగవలెనని దైవమును స్తోత్రము చేయుట వలననూ, ఎపుడూ దైవ చింతనతో ఉన్నపుడు మన యొక్క బలహీనతలను, చెడు చింతనలను దేవుని ముందు విన్నవించుచూ తనకు ఉత్తమ మార్గమును బోధించవలెనని ఎల్లప్పుడూ విచారములో దేవుని ప్రార్థించుచూ తమ ప్రయత్నమును విడనాడక ఉన్నచో మనము పొందవలసిన జ్ఞానమును పొందగలము.


నీటియందు గల పాచీలను తొలగించునట్లు మన ఆత్మను కనుగొనలేక మూసియున్న రాగద్వేషములతో కూడి యున్న పచ్చని మాయ తెరను అతి ఉష్ణముతో తప్ప వేరే ఇతర ఉష్ణములతో తొలగించలేము. ఆ ఉష్ణము ఎటువంటిదనిన యోగి యొక్క అనుభవములలో తెలుసుకొనవచ్చును. దానిని సాధారణ మానవులు చేయలేరు. కానీ, దానికన్ననూ దైవమును స్తోత్రము చేయుటవలననూ, సదా దైవమును చింతించుట వలననూ అథికమైన ఉష్ణము కలుగును. యోగులు అరణ్యములకు, కొండలు, గుహలు మొదలగు ప్రదేశములకు పోయి వంద సం|| వేయి సం|| ల కాలము తపస్సు చేసి ఈ ఉష్ణమును పొందుచున్నారు. ఈ విధముగా ఎక్కడో పోయి ఉష్ణమును పొందుటకంటే దైవాన్ని స్తోత్రం చేయుట వలననూ, ఎల్లప్పుడు ధ్యానించుటవలననూ, యోగులు పొందు ఉష్ణమునకన్ననూ ఎక్కువ ఉష్ణము (కోటి పది కోట్ల రెట్లు) మనము పొందవచ్చును. అది ఎటుల అనగా ఒక జామ సమయము ఇహలోక విచారము లేక పర విచారము మాత్రము చేయుచూ మన ఆత్మ, మనస్సు కరుగునట్లు దైవమును చింతించుచున్న యెడల లేక స్తోత్రము చేయుచుండినపుడు ఆత్మను కనుబరచక  మూసియున్న తెరలు వైదొలగును.


అజ్ఞానపు తెరల వరుసక్రమము:


1. నల్లని తెర (మహా మాయ)

2. నీలిరంగు తెర (శుద్ధ మాయ)

3. పచ్చని తెర (క్రియా శక్తీ)

4.  ఎరుపురంగు తెర (పరా శక్తీ)

5. పసుపురంగు తెర (ఇచ్చా శక్తీ)

6. తెలుపురంగు తెర (జ్ఞాన శక్తీ)

7. మిశ్రమ రంగు తెర (ఆది శక్తీ)


పైతెరలన్నీ తొలగిన పిమ్మట అరుట్పెరుం జ్యోతి దైవము యొక్క అనుభవము మనకు సిద్ధించును.


3. దయ మరియు దాని ఆవశ్యకత 


కరుణ/దయయే శివము (దైవము) అనే భావము కలిగియుండుటయే సచ్ఛీలత మరియు సత్య మార్గము. నన్ను అనగా జ్యోతి రామలింగ స్వామిని, ఎవ్వరూ పొందలేని మహాభాగ్యమును పొందు నిమిత్తమై ఎవ్వరూ ఎక్కలేని ఉత్తమ శిఖరాగ్రమునకు నన్ను ఎక్కించినది దయ అను కరుణ మాత్రమే.   


ఆ దయ సమిష్టిగా ఉండవలెను. అనగా అన్ని జీవుల పైన ప్రేమ, కరుణ ఉండవలెను. సమిష్టి ప్రేమ వలనే దయ ఉదయించును. ఇప్పుడు నా యొక్క జ్ఞానము అండ పిండ బ్రహ్మాండములను ఆపై కూడా విస్తరించియున్నది. ఇక్కడ ఉన్న జీవుల గురించి మాత్రమే కాక యావత్ జగత్తులోని జీవుల గురించి దేవుని వద్ద విన్నవించుకొన్నాను. ఎందుకు ఆలా విన్నవించుకొన్నాను అనగా మనమందరమూ సహోదరులము. నేను ఆ రకమైన ఆత్మబంధుత్వ హక్కును కలిగి యున్నను. 


ఒక పదార్థమును అనుభవించినగానీ దాని రుచి మనకు తెలియదు. అట్లు రుచి తెలియని పదార్థముపై మనకు మక్కువ కలుగదు. అటులనే దైవమును ఉన్నదియున్నట్లు అనుభవించిన గానీ దైవముపై మనకు ప్రీతీ కలుగదు. కావున దైవమును తెలుసుకోన వలెననే ముఖ్య లక్ష్యమును సంకల్పముగా ఎంచి సత్విచారము చేయవలెను. 


మనము పొందవలసిన ముఖ్యమైన మరియు చివరిదైన ఆత్మలాభము యేదనిన శివానుభవమే తప్ప వేరు కాదు. ఇక్కడ ఉన్న అందరికి స్వర్గ, నరక విచారము లేదు. (సన్మార్గులకు స్వర్గ నరకాదులు లేవు). అట్లు స్వర్గ నరక విచారము కలిగిన వారు తమ సంకల్పానుసారము పలు సాధనములు చేసి అల్ప ప్రయోజనములను పొంది భగవంతుని చెంతను చేరి కరుణ, దయ అనే తత్వములను గురించి తెలుసుకొని ఆపై ప్రయత్నించి దేవుని దయ వలన సిద్ధిని పొందెదరు. ఇది అపూర్వము.  


మన దేవుడు ఆజ్ఞాపించినది ఏమనగా మనయొక్క సాధనము కరుణ, దయ. కావున మనకు మొదటి అభ్యాసముగా ఈ క్రింది మంత్రమును ఉపదేశించియున్నారు. 



మహామంత్రము:


ఆరుట్పెరుం జ్యోతి                ఆరుట్పెరుం జ్యోతి 

తనిప్పెరుం కరుణై                   ఆరుట్పెరుం జ్యోతి


అనగా, 


దివ్యానుగ్రహ జ్యోతి                 దివ్యానుగ్రహ జ్యోతి 

అసమాన కరుణాసాగరం         దివ్యానుగ్రహ జ్యోతి

దయ, కరుణ, అనుగ్రహము అను పదములు ఒకే భావమును కలిగినది. కావున ఎక్కువ దయ కలిగిన జ్ఞానమే పూర్ణత్వము పొంది యెనలేని ఆనందమును కలిగించును. దీనినే వ్యాజ్యార్ధము అందురు. ఈ రకముగా సాధన  చేసి, పూర్ణ సంతోషానుభవము పొందుటకు ఏ ఆటంకము లేదు. 


సత్యమును చెప్పుటకే వచ్చియున్నాను. సత్యమునే పలుకుచున్నాను అని చెప్పినా తెలుసుకొనువారు లేరు. ఇపుడు పతాకమును ఆవిష్కరించినందు వలన ఇక అందరు సత్యమును గ్రహించెదరు. మనకు ముందున్నవారు సత్యమును కనిపించనీయక కప్పియుంచినారు. ఈ తరుణమున భగవంతుడు ఈ విషయమును (సత్యమును) తెలియబరచియున్నారు. ఇంకనూ తెలియచేస్తారు. కావున మీరందరూ నిజమును తెలుసుకొనండి. 


ఇపుడు నేను చెప్పినట్లు జాగ్రత్తగా నిజమైన జ్ఞానముతో సత్విచారము చేస్తూ ఉండగలరు. ఈ సత్విచారము దయతో కూడినదిగా ఉండవలెను. అది అత్యవశ్యము. ఆ దయ కలుగుటకు హేతువైన హక్కు కూడా కలిగియుండవలెను. ఈ రకముగా సత్విచారము చేస్తూ ఉన్నపుడు, భగవంతుడు వచ్చిన వెంటనే అన్ని శుభములు పొందెదరు. ఇది సత్యము! సత్యము! సత్యము!! ఇది భగవంతుని ఆజ్ఞ!!


అందరికీ తల్లి, తండ్రి, సహోదరులు  మొదలగు ఆప్తులు చేయు సహాయము ఎంతనో అంతకు కోట్ల కొలది అధికమైన సహాయము ఇచ్చునట్టి స్థలము ఈ స్థలము అనగా సిద్ధివళాగము అను మేట్టుకుప్పం. ఇది భగవంతుని ఆజ్ఞ!!

No comments:

Post a Comment