Thursday, October 29, 2015

సమరస శుద్ధ సన్మార్గము

సమరస శుద్ధ సన్మార్గ సంఘము, ఒక సార్వత్రిక పరిణామాత్మక ఆధ్యాత్మిక ఉద్యమము. ఇది వాళ్లలార్ శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారిచే 1867 వ సంవత్సరం ప్రారంభించబడినది.

ఇది సత్యము,  స్వచ్ఛత, ధర్మము మరియు సామరస్యముల సమాహారము. ఇది అఖండ దివ్య అనుగ్రహ జ్యోతి (అరుట్పెరుం జ్యోతి) యొక్క మార్గము మరియు ఈ భూమి పైనే మానవుడు పరిణామ మరణరహిత దివ్య భౌతిక దేహమును పొందుటకు పురోగమించే పరిణామ విజ్ఞానము.

అన్ని మతములు మరియు తత్వముల అంత్యమున శుద్ధ సన్మార్గము యొక్క ప్రారంభము

రామలింగ స్వామి తన ఉన్నత ఆధ్యాత్మిక మార్గమును, సమరస శుద్ధ సన్మార్గము అని అభివర్ణించెను.
సమరసము అనగా, అన్ని మతములు మరియు తత్వములు, ఆధ్యాత్మిక విభాగములన్నింటి చివరి లక్ష్యములను, తన ప్రారంభముగా (పూర్వముగా) చేసుకొని, క్రమబద్ధీకరించిన ఉన్నత అనుభవమగు గురు తురియమునకు (శుద్ధ సన్మార్గము యొక్క ప్రథమ అనుభవము) దారి తీయును. చైతన్యము (కాన్షియస్ నెస్) యొక్క క్రమము నుండి, శుద్ధ సన్మార్గము దైవత్వము యొక్క అంతిమ దశకు దారి చూపు అత్యున్నత మార్గము. శుద్ధ సన్మార్గము మత, తత్వ సన్మార్గమును (అతీంద్రియ మరియు తత్వ జ్ఞానములు) మరియు శివ సన్మార్గమును (షడాంతములు అనగా వేదాంతము, యోగాంతము, సిద్ధాంతము, భోదాంతము, నాదాంతము, కలాంతము) తనలో కలిగి, దానిని మించి ఉన్నది.

శుద్ధ సన్మార్గము అన్ని మత, తత్వ, షడాంత సన్మార్గములను తనలో కలిగి, వాటిని, వాటి గుణ, నిర్గుణ లక్ష్యములను మించి ఉన్నది. 

మత/సమయ సన్మార్గము: భగవంతుడిని నామ, రూప, గుణములతో కొలిచి, ఆచరించి, అనుభవమును పొందుట.

సన్మార్గము అనేక రకములుగా విభజింపబడియున్నది. మత సన్మార్గము యొక్క ముఖ్య లక్ష్యము, భగవంతుడిని నామ, రూప, గుణములతో కొలిచి, ఆచరించి అనుభవమును పొందుట (గుణ లక్ష్య అనుష్ఠానము).

ఈ మత సన్మార్గము సత్చిదానందము లోని కొంత భాగమును మరియు లక్షణములను బట్టి దాని యొక్క స్వచ్చతను కలిగి ఉంటుంది.

సత్ భోదము (సత్య జ్ఞానము), సత్ కర్మ, సత్ సంఘము, సత్ కాలము, సత్ విచారము, సత్ పాత్ర, సత్ జనము, సత్ ప్రవర్తన మొదలైనవి సత్యమునకు సంభందించి ఉన్నది. దీని స్వభావము అహింస, ఓర్పు, శాంతి, స్వీయ - నియంత్రణ, ఇంద్రియములపై ఆధిపత్యము మరియు ఆత్మ యొక్క ప్రకృతి సహజమైన లక్షణమగు తోటి ప్రాణులయందు కలుగు దయ. దీని ప్రాముఖ్యమును అర్థం చేసుకోవడము ద్వారా, సాధనతో సత్యమును తెలుసుకొను ఆ స్థితియే మత సన్మార్గము లేక సమయ సన్మార్గము అగును.

తత్వ సన్మార్గము: భగవంతుడిని నామ రూపములు లేక నిర్గుణముగా కొలిచి, ఆచరించి అనుభవమును పొందుట.

తత్వము మతమును మించినది. దీని ముఖ్యమైన ప్రయోజనము దైవమును నిర్గుణ లక్ష్యముతో అన్వేషించుట. మహా వాక్యములగు సోహం, శివోహం, తత్వమసి, శివత్వమసి మొదలగులను వాచ్యానుభవములుగా పొంది, ఆ తరువాత వాటి లక్ష్య అనుభవమును పొందుటయే దీని ఉన్నత లక్ష్యము.

సమరస శుద్ధ సన్మార్గము: ఇది ఉత్తమ దివ్య శిఖరమగు గొప్ప మార్గము.

శుద్ధము అనగా ఏకత్వమును మించిన స్వచ్ఛత యొక్క శ్రేష్ఠమైన స్థితి.

ఇక్కడ సన్మార్గమునకు ముందు సమరస శుద్ధ అను పదములు వచ్చుట వలన, ఇది అన్నింటినీ సామరస్యముగా తనలో కలుపుకొని తననుండి స్వచ్ఛతను భహిష్కృత పరచి, పైన చెప్పబడియున్న మతము, తత్వము మరియు షడాంతములను మించియున్నది. దీని యొక్క ఉన్నత లక్ష్యము ఎవరైతే శుద్ధ సన్మార్గము యొక్క ఉత్తమ దివ్య శిఖరమగు శుద్ధ శివ తురియాతీతమను అనుభవమును (17 వ అంతిమ అనుభవ దశ) పొందేదరో, వారే పరిపూర్ణత చెందినవారగురు.

శుద్ధ సన్మార్గ సాధన:

1. ప్రాథమిక సాధన: - పరోపకారము మరియు సత్విచారము 

పరోపకారము - సర్వ జీవులకు చేయు సేవ, జీవకారుణ్యము [జీవులయందు కారుణ్యము, దైవము యందు ప్రేమ, భక్తీ కలిగి ఉండ వలెను]

సత్విచారము - స్వీయ/ఆత్మ పరిశోధన

పరోపకారము: అన్ని జీవులు పరమాత్మ నివశించు ఆలయములు. ఆ పరమాత్ముని, అన్ని జీవులయందు దర్శించి, వారికి చేయు సేవయే పరొపకారము. సకల జీవులను కారుణ్యముతో సేవించుటయే  జీవ కారుణ్యము.

' జీవకారుణ్యమే మోక్ష గృహమునకు తాళపు చెవి ' - వాళ్ళలార్

- సంపద, ఇంద్రియములు, బుద్ధి మరియు దేహము మొదలైన అన్నింటినీ పరికరములుగా చేసుకొని సకల ప్రాణులను సేవించుటయే జీవకారుణ్యము.
- సాయము చేయలేని పరిస్థితులలో కనీసము వారి బాధను తొలగించమని స్వచ్ఛమైన మనస్సుతో ఆ భగవంతుడిని ప్రార్థించవలెను.

సత్విచారము: మన యొక్క చిన్నతనమును అనగా అల్పమగు మన స్థితిని గురించి విశ్లేషించుకొని, మనలోని అహంకారమును తొలగించుకొనవలెను.

మానవ సహజమును గూర్చి ఆత్మ పరిశోధన చేసుకొనుటయే సత్విచారము. మన అల్ప స్థితిని, దైవము యొక్క ఉన్నత స్థితిని పోల్చి స్వీయ పరిశోధన చేసుకొనవలెను. దైవము యొక్క అద్వితీయమైన లక్షణములను గూర్చి విచారించి, ఆ దైవము యందు మన కష్ఠములను మరియు లోపములను విన్నవించి, వాటిని తొలగించమని ప్రార్థించవలెను.

2. ముఖ్య సాధన:

అభిలాష, ధ్యానము మరియు అర్పణలలోనే ఒకరికి నిజమైన ఆధ్యాత్మిక పురోగతి లేక పరిణామక్రమము లభించును. దీనిని సాధించుటకు వాళ్ళలార్ మనకు 4 రకములైన క్రమశిక్షణలను బోధించిరి.

అవి,

1. ఇంద్రియ క్రమశిక్షణ
2. కరణ క్రమశిక్షణ

3. ఉన్నత సాధన

3. జీవ క్రమశిక్షణ
4. ఆత్మ క్రమశిక్షణ

4. శుద్ధ సన్మార్గ పరిపూర్ణత:

దైవానుగ్రహము లేనిచో ఏ విధమైన పరిపూర్ణత సాధ్యము కదు.
శుద్ధ సన్మార్గ పరిపూర్ణత 3 దశలలో జరుగును.
అవి,

1. చిత్ సభ అనుభవము (ఆజ్ఞ స్థానమునందు, భృమధ్యమున ఆత్మానుభవమును పొందుట)
2. ఫొర్ సభ అనుభవము (స్వర్ణ సభ)
3. శుద్ధ జ్ఞాన సభ అనుభవము

మరణమును జయించి నిత్య జీవితమును పొందుట అనునది ఉన్నత దశ. ఇది శుద్ధ సన్మార్గము యొక్క శిఖరము. మరణ రహిత దేహమును పొంది, నిత్య జీవనము పొందుటయే, శుద్ధ సన్మార్గము యొక్క పరిపూర్ణత, మరియు మహా జ్ఞాన సిద్ధి. ఇది శుద్ధ జ్ఞాన సభ అనుభవమును పొందిన తరువాత కలుగు అనుభవము.

భౌతిక దేహమును మరణము లేని దేహముగా మార్చుట, అంతరాత్మను పరిశుద్ధపరచి, అఖండ అనుగ్రహ జ్యోతి (అరుట్పెరుం  జ్యోతి) అనుభవమును పొందినపుడే సాధ్యమగును.

మరణమును జయించుట

ఇది శుద్ధ, ప్రణవ, జ్ఞాన దేహముల సమగ్ర పరిపూర్ణ పరివర్తన. దీనికి మరణము కానీ, విద్వంసము కానీ ఉండదు. దీనికి కాలము, ప్రదేశము మరియు పరిస్థితుల పరిమితులు ఉండవు.
ప్రపంచములోని జీవకోటి మరియు వస్తువులన్నింటి ఉనికిని, తన వ్యక్తిగత మరియు సార్వత్రిక సూత్రములతో, తన సంకల్ప స్వేచ్ఛతో నిర్వహించు ప్రావీణ్యత పొందును.

శుద్ధ సన్మార్గము యొక్క సత్య అనుచరులు

ఎవరైతే ఈ క్రింద ఇవ్వబడిన సూత్రములను పాటించెదరో వారే శుద్ధ సన్మార్గము యొక్క సత్య అనుచరులు కాగలరు.
  • శుద్ధ సన్మార్గమునకు ముఖ్య ప్రతిబంధకములైన మార్గములగు కుల, మతములు మరియు తత్త్వములను విడిచిపెట్టు వారు. 
  • తమ అంతర్ జ్ఞానముతో ఆగ్రహము, సంభోగము మొదలైనవాటిని తిరస్కరించి తమను తాము రక్షించుకొనువారు.
  • హత్య, జీవ హింస మరియూ మాంసాహారములనుండి దూరముగా ఉండువారు. 
వీరు అనారోగ్యము, వృద్ధాప్యము, దుఃఖము/బాధ మరియు మరణము నుండి తమను తాము రక్షించుకొనెదరు. వారు వారి యొక్క సరియైన ప్రయత్నము మరియు క్రమశిక్షణ ద్వారా ప్రకృతి యొక్క అసాధారణ లక్షణములు అనగా, ప్రమాదములు, విధి వలన కలుగు ఆకస్మిక పరిణామముల నుండి మరణమును నివారించి తమను తాము రక్షించుకొనగలరు. 
భౌతిక శరీరము మరణ రహిత దివ్య కాంతి స్వరూపముగా పరివర్తన చెందుటకు ముందు స్వీయ పరిపూర్ణత, అంతర్ స్వచ్చత మరియు దివ్య అఖండ అనుగ్రహ జ్యోతిని (అరుట్పెరుం జ్యోతి) అవగతము చేసుకొనుట ముఖ్యము. 

శుద్ధ సన్మార్గము - సత్యమునకు ప్రత్యక్ష మరియు స్పష్ఠ మైన మార్గము. 

సాంప్రదాయ గ్రంధములు, మతములు మరియు తత్వములు పాక్షిక పరిపూర్ణతను మాత్రమే ఇవ్వగలదు. సంపూర్ణ పరిపూర్ణత ఇవ్వలేదు. 

శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారు, సాంప్రదాయ గ్రంథములు, మతములు మరియు తత్వములు అనుసరించుటకు సరియైన మార్గదర్శకాలు కావని కనుగొనిరి. దానికి కారణము వాటిని నిర్మించిన వారి మానసిక స్థితి, ప్రాతినిధ్యము, వారి ఆధ్యాత్మిక స్థితి మరియు గుర్తులు, ఆయా దేవతలు మరియు మూర్తులను, వారికి సంబంధించిన మంత్రములను, నియమములను అనుసరించి చేయబడినవి. 

అవి పాక్షిక పరిష్కారమునకు దారి తీయును కానీ, పూర్తి సమగ్ర పరిపూర్ణత, సమరస శుద్ధ సన్మార్గమే ఇవ్వగలదు. ఇది శుద్ధ శివ తురియాతీత యోగము. 

ఈ పరిశీలన ద్వారా స్వామి వారి శిష్యుల మనస్సులో ఒక గందరగోళం సృష్ఠించబడినదని తెలుస్తున్నది. స్వామి దానిని ఒక ఆచరణాత్మక మార్గము ద్వారా పరిష్కరించెను. స్వామి వారు తమ శిష్యులను మతము మరియు తత్వములలో వారి సమయమును, శక్తిని వృధా చేయక, శుద్ధ సన్మార్గమను ఈ మార్గమును అనుసరించమనెను. 

మరణ రహిత దేహమును పొందుటలో దివ్య అఖండ అనుగ్రహ జ్యోతి (అరుట్పెరుం జ్యోతి) మంత్రము యొక్క శక్తి:

శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారు తమకు ఆ దివ్య అఖండ అనుగ్రహ జ్యోతి (అరుట్పెరుం జ్యోతి) స్వయముగా ప్రసాదించిన ఈ మంత్రమును తమ శిష్యులకు అనుగ్రహించెను. దివ్య అఖండ జ్యోతి తాను స్వయముగా ప్రభావంతమై మరియు దాని పర్యవసానంగా 22-10-1873 న శుద్ధ సన్మార్గ ప్రారంభమునకు గుర్తుగా ఈ మంత్రమును బహిర్గతపరిచెను.

                                   అరుట్పెరుం జ్యోతి          అరుట్పెరుం జ్యోతి
                                   తనిప్పెరుం కరుణై          అరుట్పెరుం జ్యోతి

అనగా,

                దయామయ దివ్య అఖండ జ్యోతి        దయామయ దివ్య అఖండ జ్యోతి
                అసమాన కరుణా సాగరం                   దయామయ దివ్య అఖండ జ్యోతి 

 అఖండ జ్యోతి యొక్క ప్రత్యక్ష వ్యక్తీకరణమైన ఈ మంత్రము, సాధన మార్గమునకు దోహద పడును. అందువలన ఈ మంత్రము, శిష్యులకు సమిష్ఠిగా అఖండ జ్యోతి యొక్క అనుగ్రహ వరముగా ఇవ్వబడినది. ఇది మనము సత్యమును తెలుసుకొని, మరణ రహిత దివ్య దేహమును పొందుటకు దారి చూపును.













Monday, September 7, 2015

శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారి జీవిత చరిత్ర

జననము:

పంచభూత స్థలములలో ఒకటైన చిదంబర క్షేత్రమునకు అతి సమీపములోని మరుదూరు అనే కుగ్రామములో రామయ్య పిళ్ళై మరియు చిన్నమ్మ అను దంపతులు ఉండిరి. వారు శైవ కుటుంబీకులు. రామయ్య పిళ్ళై ఊరి కరణముగా  ఉండిరి. వీరు నలుగురు సంతానమును కలిగి ఉండిరి. వారు సభాపతి, పరసురామన్, సుందరాంబాళ్ మరియు ఉణ్ణామలై .

ఒక నాడు ఒక యోగీశ్వరుడు, రామయ్య చిన్నమ్మల గృహమునకు విచ్చేసిరి. ఆ దంపతులు ఇరువరు వారిని అతిధి సత్కారములతో సత్కరించిరి. ఆ యోగీశ్వరుడు చిన్నమ్మను, ఒక దివ్య పురుషునికి తల్లి కాగలవని ఆశీర్వదించి విభూతిని ప్రసాదించెను.

ఆ తరువాత చిన్నమ్మ రామయ్య దంపతులకు ఐదవ సంతానముగా 1823 వ సంవత్సరం అక్టోబర్ 5 వ తేది ఆదివారము రామలింగ స్వామి వారు జన్మించిరి .

ఈ జననము యథేచ్చగా జరిగినది కాదు. సర్వ మానవాళి ఉన్నత స్థాయిని అధిరోహించుటకు, సత్యమును బోధించి దివ్య జీవనము పొందు మార్గమును ఉపదేశించి వారికి మార్గ నిర్దేశము చేయుటకు ఆ పరమాత్ముడు తనను ఈ భూ మండలములో జనియింప చేసాడని శ్రీ జ్యోతి రామలింగ స్వామి  వారే స్వయముగా ఈ విధముగా తెలియజేసి ఉన్నారు.

அகத்தே கருத்துப் புறத்து வெளுத்து இருந்த உலகர் அனைவரையும்
சகத்தே திருத்திச் சன்மார்க்க சங்கத்து அடைவித்திடவும் அவரும்
இகத்தே பரத்தைப் பெற்று மகிழ்ந்திடுதற்கு என்றே எனை இந்த
யுகத்தே இறைவன் வருவிக்க உற்றேன் அருளைப் பெற்றேனே ! "

అనగా, 
అంతరంగమున అజ్ఞానమను అంధకారమును, బాహ్యమున అందము మరియు సకల సంపదలు పొంది ఉన్న వారి వలె ఉన్న ఈ జనులందరినీ ఈ జగత్తులోనే వారి తప్పులను సరిదిద్ది, సన్మార్గ సంఘములో చేరి వారు కూడా ఇహమున పరమును అనగా ఈ భూమినే స్వర్గముగా చేసుకొని పరమానందమును పొందుటకే నేను ఈ యుగములో  ఆ భగవంతునిచే ఇచ్చటకు రప్పించబడి, ఆయన కృపకు పాత్రుడనైతిని.
                                                                                                            - తిరు అరుట్పా

చిదంబర దర్శనము:

ఐదు నెలల శిశు ప్రాయములో వారి తల్లిదండ్రులు దైవ దర్శనానికై స్వామివారిని చిదంబరమునకు తీసుకొని వెళ్ళిరి. చిదంబర ఆలయములో గర్భ గుడిలోని దైవ దర్శనము అనంతరము చిదంబర రహస్యమను చిత్ అంబర దర్శనమును చూపించెదరు. ఇది ఇప్పటికీ ఆ ఆలయములో గల ప్రధాన సాంప్రదాయము. ఇదే నిజమైన చిదంబర ఆలయ దర్శనము. ఆ చిదంబర రహస్య దర్శనము గావించుచుండగా, దానిని చూసిన ఐదు నెలల పసికందు అయిన రామలింగము పక పక నవ్వుచూ కేరింతలు కొట్టి ఆనందించెను. దీనిని చూసిన ఆలయ అర్చకులు ఈ బిడ్డ సామాన్యుడు కాడని, సాక్షాత్తు ఆ నటరాజుని కుమారుడని ఆశ్చర్యపడి, ఆ దంపతులను వారి ఇంటికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి, ఆశీర్వదించి పంపిరి. ఈ దర్శన వివరమును స్వామి వారు తమ 49 వ ఏట తాము వ్రాసిన తిరు అరుట్పా అను గ్రంధములో ఈ విధముగా పొందు పరచియున్నారు.

தாய் முதலோரோடு சிறு பருவத்தில் தில்லைத்
தலத்திடையே திரை தூக்கித் தரிசித்த போது
மேய் வகைமேல் காட்டாதே என்தனக்கே எல்லாம்
வெளியாகக் காட்டிய என் மெய்யுருவாம் பொருளே
காய்வகை இல்லாது உளத்தே கனிந்த நறுங்கனியே
கனவிடத்தும் நனவிடத்தும் எனைப்பிரியாக் களிப்பே
தூய்வகையோர் போற்ற மணி மன்றில் நடம் புரியுஞ்
ஜோதி நடத்தரசே என் சொல்லும் அணிந்தருளே ! "

అనగా, 

తల్లి మొదలైన వారితో చిరు ప్రాయమున చిదంబర క్షేత్రమున తెరను తీసి దర్శించినప్పుడు అంతటా శూన్యమును, ఆకాశమును చూపిన నా సత్య స్వరూపమా 
నా హృదయములో ఫలించిన సుఫలమా 
స్వప్నములోనూ మెలకువలోనూ నన్ను వీడని ఆనందమా 
స్వచ్ఛమైన వారు ప్రశంసించుచుండగా ఛిదాకాసములో నాట్యమాడు 
జ్యోతి నటరాజా నా మాటలను ఆలకించి అనుగ్రహించుము. 

బాల్యము: 

చిదంబర దర్శనానంతరం ఆలయములో కలిగిన అనుభవముతో దైవానుగ్రహము పొందిన ఆనందోత్సాహములు ముగియక ముందే ఒక నెల సమయములోనే  స్వామివారి తండ్రి రామయ్య పిళ్ళై మరణించెను. 

ఒంటరిగా పిల్లలను పెంచే స్థోమత లేక తన ఐదుగురు పిల్లలతో కలిసి మరుదూరును వదలి తన పుట్టినిల్లయిన చెంగల్పట్టు జిల్లా లోని చిన్నక్కావనము అను గ్రామములో ఆశ్రయము పొందెను. 

కొన్ని సంవత్సరములు గడిచి పెద్ద కుమారుడైన సభాపతి పెద్ద వాడై కుటుంబ భారమును తనపై స్వీకరించెను. కుటుంబమును పోషించుటకు గొప్ప అవకాసములను చెన్నై పట్టణము తనకు కలిగించునని సభాపతి గ్రహించెను. ఆ కుటుంబము చిన్నక్కావనమును వదిలి చెన్నై పట్టణములో స్థిర పడెను. 

స్వామివారు జన్మించిన మరుదూరు గ్రామములోని వారి స్వగ్రుహము తరువాత కాలములో ప్రార్థనా స్థలముగా పరిగణించబడెను. ప్రతి ఏటా తై పూస దినమున ప్రజలందరూ అక్కడ చేరి ప్రార్థనలు నిర్వహించెదరు. 

విద్యాభ్యాసము మరియు పసి ప్రాయము: 

చెన్నై పట్టణములో అన్న సభాపతి గొప్ప పండితులైన కంచి సభాపతి నావలార్ వద్ద తమిళ సాహిత్యమును అభ్యసించెను. ఆ పాండిత్యముచే కొంతమంది సీమంతుల సహకారముతో సభాపతి పురాణ, మత ప్రవచనలు గావించి సంపాదనను పొంది కుటుంబమును పోషించుచుండెను. ఇతర సమయములలో బాలురకు ప్రాథమిక విద్యను బోధించుచుండెను. 

రామలింగమునకు అపుడు 5 సంవత్సరములు. అన్న సభాపతి ఒక గురువు గా తన తమ్మునికి తమిళ సాహిత్యములోని ప్రాథమిక విషయములను బోధించుటకు ప్రయత్నించెను. రామలింగం విద్య యందు ఏ విధమైన ఆశక్తి చూపకుండెను. సభాపతి, కాలక్రమేణా తన సోదరుడు ఆశక్తి చూపగలడని ఆశించెను. అయినప్పటికీ ఆ బాలుడు విద్య యందు ఏ విధమైన ఆశక్తి చూపక చెన్నై జార్జ్ టౌన్ లోని కందకోట్టం అను శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయమునకు వెళ్లి దైవ ప్రార్థనలో మునిగియుండెను. తన సోదరుని వద్ద విద్యను అభ్యసించ ఆశక్తి చూపని బాలుడు పరుల వద్దనైననూ అభ్యసించునని ఆలోచించి సభాపతి తాను విద్య నేర్చుకున్న తన గురువు గారైన కంచి సభాపతి గారి వద్దనే తన సోదరుడు విద్యను అభ్యసించుటకు రామలింగమును ఆయనకు అప్పగించెను. 

తనకున్న తమిళ సాహిత్య ప్రావీణ్యముతో రామలింగామును విద్యావంతుడను చేయుటకు గురువు ఎంతగానో ప్రయత్నించిననూ అతను ఏ విధముగానూ విద్య పట్ల ఆశక్తి ప్రదర్శించలేదు. ఎల్లప్పుడూ కందకొట్ట ఆలయమును దర్శించి, సుబ్రహ్మణ్య స్వామిని గూర్చి భక్తి గీతములను ఆలపించి ధ్యానము చేయుచుండెను. 

ఒక నాడు గురువు గారు తమిళ వాచకము లోని నీతి వాక్యమును ఈ క్రింది విధముగా బోధించుచుండిరి. 

ஓதாமல் ஒருநாளும் இருக்க வேண்டாம் 
ஒருவரையும் பொல்லாங்கு சொல்லவேண்டாம் 
மாதாவை ஒருநாளும் மறக்க வேண்டாம் 

ఓదామల్ ఒరు నాళుం ఇరుక్క వేండాం 
ఒరువరయుం పోల్లాంగు సొల్ల వేండాం
మాతావై ఒరు నాళుం మరక్క వేండాం

అనగా,

చదువకుండా ఏ రోజూ ఉండవద్దు 
ఎవ్వరినీ చెడు మాటలు అనవద్దు 
తల్లిని ఏ రోజూ మరువ వద్దు 

ఇందుకు రామలింగము " అయ్యా! ఇట్లు వేండాం వేండాం (వద్దు వద్దు) అంటుంటే పిల్లలమైన మాకు అందులో ఏదో రహస్యము దాగి ఉంది అను భావన కలుగుట సహజము కనుక కావలెను అంటే దానిని కోరి చేయుట సహజముగా ఉండును." అని చెప్పి తాను నిత్యము  సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి తానే స్వయముగా రాసి ఆలాపించే "దైవమణి మాల" అను అధ్యాయము లోని ఒక కీర్తనను తన గురువు గారికి క్రింది విధముగా వినిపించెను. 

ஒருமையுடன் நினது திரு மலரடி நினைக்கின்ற
உத்தமர் தம் உறவு வேண்டும்
உள்ளொன்று வைத்துப் புறம்பொன்று பேசுவார்
உறவு கலவாமை வேண்டும்
பெருமை பெறு நினது புகழ் பேச வேண்டும்
பொய்மை பேசாது இருக்க வேண்டும்
பெரு நெறி பிடித்தொழுக வேண்டும்
மதமான பேய் பிடியாதிருக்க வேண்டும்
மருவு பெண்ணாசையை மறக்கவே வேண்டும்
உனை மறவாதிருக்க வேண்டும்
மதி வேண்டும்; நின் கருணை நிதி வேண்டும்
நோயற்ற வாழ்வில் நான் வாழ வேண்டும்

ఒరుమయుడన్ నినదు తిరు మలరడి నినైక్కిండ్ర 
ఉత్తమర్ తం  ఉరవు వేండుం 
ఉల్లొండ్రు వైత్తు పురం ఒండ్రు పెసువార్ 
ఉరవు కలవామై వేండుం 
పెరుమై పెరు నినదు పుగళ్ పేస వేండుం 
పోయిమై పేసాదు ఇరుక్క వేండుం 
పెరు నెరి పిడిత్తోళుగ వేండుం 
మదమాన పేయి పిడియాదిరుక్క వేండుం 
మరువు పెన్నాశయై మరక్కవే వేండుం 
ఉనై మరవాదిరుక్క వేండుం 
మది వేండుం, నిన్ కరుణై నిధి వేండుం 
నోయట్ర వాళ్విల్ నాన్ వాళ వేండుం 

అనగా,

ఏకాగ్రతతో నీ పాదపద్మములను స్మరించు 
ఉత్తముల అనుబంధము కావలెను
లోన ఒకటి తలచి బయటకు వేరొకటి మాట్లాడు 
జనుల అనుభంధము కలుగని వరము కావలెను   
గొప్పవైన నీ గొప్పతనమును 
ఎల్లప్పుడూ మాటలాడుచుండవలెను 
అబద్ధములాడుట మానవలెను 
నిజమైన భక్తి మార్గములో 
నిన్ను ఆరాధించవలెను 
నిను మరువని గుణము కలిగి ఉండవలెను 
మంచి బుద్ధికుశలత కలుగ వలెను 
నీ కరుణామృతము కైకొనవలెను 
బాధలు, రోగము  లేని జీవితము 
నేను గడుపవలెను

ఈ మాటలకు గురువుగారు ఈ విద్యార్థి యొక్క జ్ఞానమును ప్రశంసించి ఇతనికి విద్యనేర్పుటకు తాను అసమర్థుడనని, అన్నగారైన సభాపతిపిళ్ళై గారికి చెప్పి తమ్ముడైన రామలింగమును అప్పజెప్పెను.  గురువుని ఎదిరించు జ్ఞానము కలిగినవాడా నీవు? అని తమ్ముని అన్న మందలించెను. ఆనాటి నుండి రామలింగము విద్యనభ్యసించుట మానుకొని పుణ్యక్షేత్రములను సందర్శించుచూ తిరుగుచుండెను.  

దీనిని చూసిన అన్న సభాపతి కలతచెంది కోపముతో రామలింగమునకు అన్నపానీయములను ఇవ్వక ఇంటి నుండి వెలివేసెను. సభాపతి తీసుకొన్న అంతటి కఠిన నిర్ణయము కుడా అతనికి ఆశించిన ఫలితమును ఇవ్వలేదు. 

దీనికి విరుద్ధముగా రామలింగము పూర్తిగా దైవ భక్తిలో నిమఘ్నమై ఎల్లప్పుడూ దైవ ప్రార్థన, ధ్యానములలో మునిగియుండెను. రోజులు గడిచినవి. వదినగారైన పాప్పాత్తి అమ్మాళ్ తాను తన కన్న బిడ్డలా పెంచుకొంటున్న రామలింగము పడు కష్టములను చూసి బాధపడెను. 

ఒక నాడు ఆమె కన్నీరు పర్యంతమై రామలింగాముతో బుద్ధిగా చదువుకొని అన్నగారి మనసు నొప్పక నడుచుకొనవలెనని వేడుకొనెను. తల్లితో సమానమైన వదినగారి ఆవేదనను చూడలేని రామలింగము తన అన్నగారి కోరిక మేరకు చదువుకొనుటకు అంగీకరించెను. తన వదిన తో  చదువుకొనుటకు ఏకాంతముగా తనకు ఒక గది కావలెనని కోరెను. ఈ విషయమును ఆమె తన భర్తయైన సభాపతికి విన్నవించినది. సభాపతి ఆనందించి రామలింగమునకు ప్రత్యేకముగా ఒక గదిని కేటాయించెను. ఇంటిలోని మేడపై ఉన్న గదిని రామలింగమునకు తన చదువు మరియు అధ్యయనాలకు ఎటువంటి అంతరాయము లేకుండుట కొరకు కేటాయించిరి. ఇది వరకు ప్రపంచము అన్వయించిన విద్యా విధానముల వలె కాక రామలింగము యొక్క చదువు భిన్నముగా ఉండెను.  సాహిత్య పుస్తకములను సేకరించి అధ్యయనము చేయుట మాని  పూజా ధ్యానములకు వస్తువులను సేకరించెను. గదిలో ఒక దీపమును వెలిగించి దాని ఎదురుగా పెద్ద అద్దమును ఉంచెను. 

ఆ అద్దము ముందు కూర్చొని దానిలో దీప వెలుగు కేంద్రీకృతమైన ప్రదేశమును చూచి, ధ్యానము చేయసాగెను. ఆ ధ్యాన ఫలముగా ఒక నాడు రామలింగమునకు సుబ్రహ్మణ్య స్వామి దర్శన భాగ్యము ఆ అద్దములోనే లభించినది. ఆ దివ్య దర్శనం కలిగిన వెంటనే రామలింగమునకు తన మనస్సు, బుద్ధి, దేహము ఆత్మ అన్నియు దివ్యమైన తేజస్సు మరియు దివ్యానందమును సంతరించుకున్నది.  

ఈ దర్శన వివరమును స్వామి వారు ఆయన వ్రాసిన తిరు అరుట్పా అను గ్రంథములో ఈ విధముగా పొందుపరచియున్నారు. 

சீர்கொண்ட தெய்வ வதனங்கள் ஆறும் திகழ்கடப்பந்
தார்கொண்ட பன்னிரு தோள்களும் தாமரைத் தாள்களும்ஓர்
கூர்கொண்ட வேலும் மயிலும்நற் கோழிக் கொடியும்அருட்
கார்கொண்ட வண்மைத் தணிகா சலமும்என் கண்ணுற்றதே

అనగా,

దైవత్వముతో నిండిన 6 వదనములు (ముఖములు), 12 భుజములు, ఒక పదునైన వేలాయుధము, వాహనమగు నెమలి, కోడి బొమ్మ కలిగిన జెండా, కృపా సాగరమగు తణిగాచలం (తిరుత్తణి కొండలు) నాకు సాక్షాత్కరించినవి. 

 ఏ విద్యాభ్యాసము లేకనే సకల విద్యాపారంగతుడై అన్ని కళలు, జ్ఞానములయందు దైవ కృపచే గొప్ప ప్రావీణ్యము పొందెను.  ఈ విషయమును స్వామి వారు స్వయముగా తామే తిరు అరుట్పా లోని కీర్తనలలో పొందు పరచియున్నారు.

"குமாரப் பருவத்தில் என்னைக் கல்வியிற் பயிற்றும் ஆசிரியரை இன்றியே என் தரத்தில் பயின்று அறிதற்கு அருமையாகிய கல்விப் பயிற்சியை எனது உள்ளகத்தே இருந்து பயிற்றுவித்து அருளினீர்." - பெரு விண்ணப்பம்

"కుమార పర్వములో నన్ను ఏ గురువు లేకనే నా తరమునకు తగిన విధముగా అరుదైన దివ్య విద్యను నాలో నుండి నాకు బోధించితివి" - మహా విన్నపము

"பள்ளி பயிற்றாது என்தனைக் கல்வி பயிற்றி முழுதுணர்வித்து"

" పాఠకశాలలో విద్యాభ్యాసము చేయక నాకు నీవే విద్యాభ్యాసము చేసి అన్నింటినీ తెలియజేసితివి."

"ஓதுமறை முதற் கலைகள் ஓதாமல் உணர உணர்விலிருந்து உணர்த்தி"

" విద్యనభ్యసించి నేర్చుకొనవలసిన కళలన్నీ విద్యను అభ్యసించకనే నేర్చుకొనేలా నాలో నుండి నేర్పితివి"

"ஓதி உனர்ந்தவர் எல்லாம் எனை கேட்க எனைத்தான் ஓதாமல் உணர்ந்து"

"గొప్ప చదువులు చదివిన వారందరూ, నన్ను అడుగగా, నేను చదవకనే సకల జ్ఞానములను పొందేలా చేసితివి"

"ஒதாதுணர்ந்திட ஒளி அளித்தேனக்கே"

"విద్యను అభ్యసించకనే సకల జ్ఞానములను తెలుసుకోగల జ్ఞాన వెలుగును నాకు ప్రసాదించితివి"

పురాణ ప్రవచనము:

తమిళ సాహిత్యములో తనకున్న ప్రావీణ్యము మరియు వాగ్ధాటితో అన్న సభాపతి కొందరి సంపన్నుల ఇంట్లో వారి కోరిక మేరకు ప్రవచనములు చేయుచూ కొంత సంపదను వేతనముగా పొందుచుండెను. ఇది వారి కుటుంబ కర్చులకు చేయూతనిచ్చుచుండెను.

ఒక నాడు సభాపతిని ఊరి పెద్దైన సోము చెట్టియార్ తమ గృహములో కొన్ని దినములు పెరియ పురాణము ప్రవచనము చేయుటకు  ఆహ్వానించిరి. ఈ ప్రవచనములు కొద్ది రోజులు సజావుగా సాగినది. ఒక రోజు సభాపతి తన అనారోగ్యము కారణముగా ఆ కార్యక్రమమునకు వెళ్ళలేక పోయెను. ప్రజలను, కార్యక్రమ నిర్వాహకులను నిరాశ పరచుటకు సభాపతికి ఇష్టము లేదు. ఏమి చేయాలో తెలియని స్థితిలో తన భార్య తన తమ్ముని జ్ఞానమును గురించి ఇది వరకే యెరిగినదై, రామలింగమును ప్రవచనము చేయుటకు పంపమని సలహా ఇచ్చెను.

సభాపతి తన తమ్ముని జ్ఞానమును గూర్చి ఎరుగక ఆమె సలహాను తిరస్కరించెను. కాని వేరొక ఉపాయము లేక చివరగా తన తమ్ముని పంపుటకు అంగీకరించెను. రామలింగమును పిలచి, ప్రేక్షకులకు ఒకటి లేదా రెండు పద్యములు చదివి వినిపించి, నిర్వాహకులకు తాను రాలేకపోయిన కారణమును విన్నవించి క్షమాపణ కోరమని చెప్పి పంపెను.

సభలో, తన సోదరుని పరిస్థితిని వివరించుటకు రామలింగము వెళ్ళినప్పుడు నిర్వాహకులు కొంత కలత చెందిరి. ప్రేక్షకులు గుమికూడి ఉన్న సమయమున, ప్రవచనము చేయు వారు లేక నిరాశ చెందిరి. ప్రేక్షకుల నుంచి ఎటువంటి గొడవలు జరుగక ముందే, వేరే ఉపాయము లేక అయిష్టతతో నిర్వాహకులు రామలింగమును తనకు వచ్చినది ఏదో ఒకటి చెప్పమని చెప్పెను. రామలింగము ప్రేక్షకుల ముందు కూర్చొని తన ప్రవచనమును ప్రారంభించినపుడు, అందరూ తనను చూసి ప్రవచన విషయము చాలా లోతైనది, కేవలము పండితులు, ఉన్నత విద్యలను అభ్యసించిన వారు మాత్రమే చెప్పగలరు, ఈ చిన్న వయసులో ఇతను ఏమి చెప్పగలడని ఆలోచించుచుంటిరి.

పెరియ పురాణము లోని మొదటి పదము ' ఉలగెలామ్ ' (ప్రపంచములన్నియూ) అను పదమును వ్యాఖ్యానమునకు తీసుకొనబడినది. రామలింగమునకు, వరద ప్రవాహములో ప్రవహించు నీటి వలె పదాలు వేగంగా తన మాటల రూపములో ప్రవహించెను. (ఉలగెలామ్ అను మాటకు వ్యాఖ్యానముగా వివిధ రకములైన ప్రపంచముల గురించిన వివరణ రామలింగ స్వామి వారు రచించిన గద్య భాగములో కలదు)

సభలో నిశ్శబ్ధము అలముకొని అందరూ ఆ బాలుని అసాధారణ వాగ్ధాటిని చూసి ఆశ్చర్యపడిరి. అర్థ రాత్రి అయినా, ఇంకా ఒక్క పద్యములోని కనీసము రెండు వాక్యములు కూడా పూర్తి కాలేదు. ప్రవచన అనర్ఘళముగా సాగుతోంది. ఒక్కొక్క పదమునకు వివరణ ప్రవాహము వలె సాగుతుండడముతో,   సమయమును గురించి ఎవరూ చింతించలేదు. నిర్వాహకులు ప్రజలకు ఇబ్బంది కలుగునని ఆలోచించి, ప్రవచనమును ముగించి, రామలింగమును సత్కరించి ఇంటికి పంపెను.

కార్యక్రమ నిర్వాహకులు సోము సెట్టి గారు మరుసటి రోజు స్వయముగా సభాపతిని సందర్శించి యోగ క్షేమములు అడిగి తెలుసుకొని, ఇక పై వారి సోదరుడు రామలింగమునే ప్రవచనములు చేయుటకు పంపమని, ఇది ప్రజలందరి అభీష్టమని తెలిపిరి. సభాపతిని కూడా వచ్చి వారి తమ్ముని అనర్గళ ప్రవచనములను వీక్షించెదరని ఆహ్వానించిరి. సభాపతి ఆశ్చర్యచకితుడై, కనీసం బడికి కూడా వెళ్ళని వాడు ఇలా అందరి మన్ననలను పొంది, అనర్ఘళముగా ప్రవచనలు ఎలా చేయుచున్నాడు అని తనను తాను ప్రశ్నించుకొనెను.

తన సందేహమును నివృత్తి చేసుకొనుటకు, సభాపతి తానే స్వయముగా ప్రవచనమును వీక్షించుటకు వెళ్ళెను. సభా స్థలమునకు ఒక మూలగా, ఎవరూ గమనించని ప్రదేశములో నిలబడి తన సోదరుని ప్రవచనమును వినెను. మొదట కలగనుచున్నామని భ్రమించెను. కానీ తరువాత అది కల కాదు సత్యమని గ్రహించెను. నమ్మసఖ్యముకాని ఆ దివ్య ఆనందముతో ఇంటికి వెళ్లి తన భార్యతో జరిగినదంతా వివరించెను. రామలింగము సామాన్య బాలుడు కాదని, దైవానుగ్రహమని ఇరువరూ నిర్ధారించుకొనెను. రామలింగము కూడా అప్పుడే తన ప్రవచనమును ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చెను.

సభాపతి తాను రామలింగము పట్ల ప్రవర్తించిన తీరుకు కలత చెంది విచారము వ్యక్తము చేసెను. విధేయతతో కూడిన ఆప్యాయతతో రామలింగమును ఆలింగము చేసుకొనెను. ఈ వార్త చుట్టూ ఉన్న అనేక ప్రదేశాలకు ప్రభలి, ఆ బాలుని చూచుటకు, అతని ముఖములో నుండి వెలువడే పలుకులను వినుటకు ప్రజల రాసాగిరి.

రామలింగము తన అపూర్వ ఆధ్యాత్మిక ప్రవచనలతో ప్రజలను ఆకర్షించెను. ఆ ప్రవచనలకు ఆనందించి సంపన్నులు ఆయనకు సంపదలను, కానుకలను ఇచ్చిరి. కానీ రామలింగమునకు సిరి సంపదల పైన ఏ మాత్రము కోరిక లేదు. అభిమానముతో ప్రజలు ఇచ్చు కానుకలను కాదనలేక స్వీకరించి, దారిలోనున్న కొలనులో పారవేయుచుండెను.

గొప్ప పండితులు, మత బోధకులు రామలింగమునకు శిష్యులైరి.  ప్రెసిడెన్సీ కాలేజీ, మద్రాసు లో తమిళ భాషా అధ్యాపకులు (ప్రొఫెసర్) గా ఉన్న తొళువూర్ వేలాయుధ ముదలియార్, రామలింగమును, తన ప్రావీణ్యతను పరీక్షించ దలచి, తానే స్వయముగా కొన్ని పద్యములను వ్రాసి, అవి తమిళ సంఘ కాల సాహిత్యములోని పాటలని, దానిని వివరించమని రామలింగమును కోరెను. కానీ రామలింగము దానిని చూచిన వెంటనే అది సంఘ కాల సాహిత్యము కాదని, దానిని వ్రాసినది ఒక అభ్యాసకుడు, కనుకనే ఇన్ని తప్పులు కలవు. సంఘ కాల సాహిత్యములలో ఇట్టి తప్పులు ఉండవని చెప్పెను. వేలాయుధము యొక్క గర్వము భంగమయ్యెను. రామలింగమునకు పాదాభివందనము చేసి తనను శిష్యునిగా స్వీకరించమని ప్రాధేయపడెను. 1849 వ సం స్వామివారికి వేలాయుధము శిష్యుడయ్యెను. అప్పుడు స్వామివారి వయస్సు 26, వేలాయుధమునకు 17. అప్పటి నుండి రామలింగ స్వామి వారి ప్రధాన శిష్యులలో  ఒకరిగా వేలాయుధము చిరస్థాయిని పొందెను.

చెన్నైలోని తిరువొట్రియూర్ నందు గల వడివుడై అమ్మ సమేత త్యాగరాజ స్వామి ఆలయమునకు ప్రతి రోజూ నిత్యము వెళ్లి రామలింగ స్వామి వారు దర్శించుచుండెను. అమ్మవారికి వారే స్వయముగా తిరు అరుట్పా లోని మొదటి సంపుటి లోని "వడివుడై మాణిక్య మాల " అను పేరుతో కీర్తనలను వ్రాసిరి. "ఇంగిత మాల", రెండవ సంపుటిలోని చాలా భాగము, మూడవ సంపుటి పూర్తిగా తిరువొట్రియూర్ క్షేత్రము నుండి పాడినవే.

ఒక నాడు తిరువొట్రియూర్ వెళ్లి చెన్నైకి ఆలశ్యముగా వచ్చి తన సోదరి ఇంటి బయట అరుగు మీద ఆకలితో పడుకున్న రామలింగమునకు, ఆ వడివుడై అమ్మవారే స్వయముగా తన సోదరి రూపములో వచ్చి తన అమృత హస్తములతో భోజనము ప్రసాదించెను.  

వివాహము:

అన్న సభాపతి తన తమ్మునికి వివాహము చేయదలచెను. కాని రామలింగము అందుకు అంగీకరించలేదు. బంధు మిత్రులు కోరినా ఫలితము లేక పోయినది. చివరిగా కన్న తల్లి ఒక యోగీశ్వరుని హితబోధ చేయమని కోరగా ఆయన రామలింగమును వివాహమునకు అంగీకరింపజేసెను. కన్నతల్లిని, అన్నను బాధపెట్టలేక వివాహమునకు ఆయన అంగీకరించెను.

రామలింగము, తన  అక్క ఉణ్ణామలై కుమార్తె ధనకోటి ని 1850వ సంవత్సరము వివాహమాడెను. వారి తొలి రాత్రి, ఆలూ మగల ఏకాంత సమయమున రామలింగము మాణిక్య వాసగర్ వ్రాసిన ' తిరు వాసగము ' ను తన భార్య ధనకోటి కి చదివి వినిపించెను. ఆ రాత్రంతయూ ఇది కొనసాగినది. ఆ రాత్రి రామలింగమునకు దైవ పారవశ్యమైన అనుభవముగా ఉండెను.

 రోజులు గడిచిన కొద్దీ, రామలింగము వ్యక్తిత్వము మరియు జీవితము పరివర్తన చెంద సాగినది. తీర్థయాత్రలు చేయ సంకల్పించిన రామలింగము, తన భార్యను పిలచి, 'తిరు వాచకము' ను తన చేతికి ఇచ్చి, తాను తీర్థయాత్రలకు వెళ్ళుచున్నానని, ఇకపై ఆమె భక్తి మార్గమును అనుసరించి, దైవ కృపకు పాత్రురాలు కావలెనని హితోపదేశము చేసి తాను బయలుదేరెను.

తన 35 వ ఏట 1858 వ సం చెన్నైను విడిచి, వివిధ పుణ్యక్షేత్రములను దర్శించిన రామలింగము, చివరిగా చిదంబర క్షేత్రమును చేరుకొనెను. చిదంబరములో స్వామివారిని చూసిన కరుంగుళికి చెందిన వెంకట రెడ్డి తన గ్రామమునకు విచ్చేయమని కోరెను. స్వామివారు అందుకు అంగీకరించిరి. వెంకట రెడ్డి స్వామి వారిని భక్తి మర్యాదలతో తన గృహమునకు తీసుకువెళ్ళి అక్కడే ఆయనను తమ నివాస స్థలమును ఏర్పరచుకొని ఉండవలసినదిగా కోరెను.

ఆయన కోరికను మన్నించిన స్వామివారు, వెంకట రెడ్డి గృహములోనే ఉండుటకు అంగీకరించెను. కరుంగుళికి 1858 వ సం వచ్చిన స్వామి వారు 1867 వ సం వరకు అక్కడే ఉండిరి. ఈ కాలములో తరచూ, చిదంబర క్షేత్రమును దర్శించుచుండెను. తిరు అరుట్పా లోని 4 వ సంపుటి మరియు 6 వ సంపుటిలోని మొదటి సగ భాగము ఈ కాలములోనే  వ్రాయబడినది. ఈ కాలములోనే నటరాజుని సంపూర్ణ అనుగ్రహము స్వామి వారికి లభించినది. నటరాజానుగ్రహము అనంతరము, రామలింగ స్వామి వారు సాంఘిక దురాచారాలను నిర్మూలించుటకు కృషి చేసెను. మానవుల యొక్క సకల దుఃఖములను తొలగించుటకు ఉపాయము కనుగొనవలెనని సంకల్పించెను.

జాతి, మత, కుల, భాషా విభేదాలే మానవులకు అతి పెద్ద అడ్డుగోడలని రామలింగము గ్రహించెను. వైదిక ఆధిపత్యమును సంపూర్ణముగా ఎదిరించెను. ముఖ్యముగా చిదంబర ఆలయములో వైదీక ఆధిపత్యమును తొలగించుటకు కృషి చేసెను. ఈ సంఘటన అక్కడ ఉన్న వేద పురోహితులను ఆగ్రహావంతులను చేసినది.

చిదంబరములో అప్పుడు ఉన్న పరిస్థితులను గమనించిన రామలింగము అక్కడ తాను అనుకున్నది చేయలేనని భావించి, సర్వ మానవాళి, ఏ కుల, మత, వర్ణ భేధములు లేకుండా నటరాజ స్వామిని కొలుచుటకు ఒక ప్రత్యేకమైన ఆలయమును చిదంబర క్షేత్రమునకు సమీపములోనే నిర్మించదలచిరి. ఇదే వడలూరు నందు నిర్మించిన సత్య జ్ఞాన సభ. అప్పటి పార్వతీపురముగా పిలువబడిన వడలూరులో స్వామి వారు సత్య జ్ఞాన సభను నిర్మించి ' దానిని ఉత్తర జ్ఞాన చిదంబరము' గా ప్రసిద్ధి గావించెను.

సమరస శుద్ధ సన్మార్గ సంఘము - 1865 :

వాళ్లలార్ శ్రీ జ్యోతి రామలింగ స్వామి, సమరస శుద్ధ సన్మార్గ సంఘము అను ఒక మార్గమును 1865 వ సం కనుగొనిరి. ఈ సంఘము యొక్క ముఖ్య ఉద్దేశము,

1. భగవంతుడు ఒక్కడే, ఆయనను సత్యమైన ప్రేమతో, జ్యోతి స్వరూపములో కొలువవలెను.
2. చిరు దేవతలను పూజింపరాదు. ఆ దేవతల పేరుతో జంతు బలులు ఇవ్వరాదు. మాంసము భుజింపరాదు.
3. జాతి, కుల, మత భేదములు ఉండరాదు. అన్ని ప్రాణులను తమ ప్రాణముగా భావించి, ఆత్మ బంధుత్వ                   ఐకమత్యమును కలిగి ఉండవలెను.
4. పేదవారి ఆకలి తీర్చుట మొదలైన జీవకారుణ్య ప్రక్రియయే మోక్ష గృహమునకు తాళపు చెవి.
5. పురాణ, ఇతిహాస, శాస్త్రములు సంపూర్ణ సత్యమును తెలియజేయలేవు.
6. మరణించిన వారిని సమాధి చేయవలెను. అగ్నికి ఆహుతి చేయరాదు.

ఈ సూక్తులను అనుసరించి, అందరికీ తెలియజేయుటకే సమరస శుద్ధ సన్మార్గ సంఘమును స్వామి వారు 1865 వ సం ఎర్పరిచిరి.

తిరు అరుట్పా ప్రచురణ - 1867:

1867 వ సం తిరు అరుట్పా లోని మొదటి 4 సంపుటలు (తిరు మురై) ప్రచురితమైనవి.

సత్య ధర్మశాల - (23-05-1867):

వళ్ళలార్ శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారి భోధనలలో ముఖ్యమైనది జీవకారుణ్యము. జీవకారుణ్యమును స్వామి వారు రెండు విధములుగా విభజించిరి. అవి,

1. ప్రాణులను వధింపరాదు మరియు మాంసాహారము భుజింపరాదు.
2. ఆకలితో ఉన్నవారికి ఆహారము ఇవ్వవలెను.

స్వామివారు ఆకలిని ఒక రోగముగా అభివర్ణించెను. ఆకలి బాధ భరించలేక, మానవుడు తనకున్న అన్నింటినీ పోగొట్టుకొనగలడు. మొదట ఆకలి తీర్చిన తరువాతనే మనిషి మంచి చెడులను గూర్చి ఆలోచించును. జ్ఞానము పొందుటకు, ముందు ఆకలి నుండి విముక్తి పొంద వలెనని తలచి, గ్రామస్థులు, శిష్య మిత్ర బృందము సహకారముతో వడలూరులో ధర్మశాలను నిర్మించిరి. ఇది 1867 వ సం మే నెల 23 వ తేదీన ప్రారంభమైనది. ధర్మశాలలో స్వామివారు అప్పుడు తమ స్వహస్తములతో వెలిగించిన పొయ్యి ఇప్పటికీ వేలుగుచూనే ఉన్నది. ప్రతి రోజూ వేల మంది పేద ప్రజలకు అన్నదానము జరుగుచున్నది. ధర్మశాల స్థాపనానంతరము, స్వామివారు 1870 వ సం వరకు అక్కడే నివశించిరి.

సిద్ధి వళాగము (సిద్ధి ప్రాంగణము) - 1870:

ధర్మశాలలో ఉన్న స్వామివారు, అక్కడ రద్దీ పెరుగుటచే, ఏకాంతము కోరి, వడలూరునకు సమీపములో 5 కి. మీ. దూరములో ఉన్న మేట్టుకుప్పము అను ఒక కుగ్రామమునకు వెళ్ళి అక్కడే బస చేయుచుంటిరి.

మేట్టుకుప్పములో స్వామివారు నివశించిన ఆ భవనము సిద్ధి వళాగము (సిద్ధి ప్రాంగణము) అని పిలువబడుచున్నది. ఈ పేరు స్వయముగా స్వామివారే ఆ భవనమునకు పెట్టిరి. సిద్ధిని ప్రసాదించు స్థలము అని దీని అర్థము.

1870 వ సం నుండి 1874 వ సం  లో స్వామివారు సిద్ధి పొందుట వరకు ఎక్కువ సమయము ఇక్కడే గడిపిరి. సిద్ధి పొందినది కూడా ఇక్కడే.

సత్య జ్ఞాన సభ - (25-01-1872):

భగవంతుడిని అరుట్పెరుం  జ్యోతి (దివ్య అఖండ అనుగ్రహ జ్యోతి) స్వరూపములో దర్శించిన స్వామివారు, ఆ దివ్య అఖండ జ్యోతిని ఆరాధించుటకు వడలూరులో సత్య జ్ఞాన సభను ఏర్పరచిరి. 1871 వ సం సత్య జ్ఞాన సభను నిర్మించుటకు ప్రారంభించిరి.

1872 వ సం జనవరి 25 వ తేదీన, గురువారము, పుష్యమి నక్షత్రమున మొదటి సారి సభలో ఆరాధనలు మొదలైనవి. ప్రజలందరూ దివ్య అఖండ జ్యోతిని దర్శించుకొని, ఆనంద పారవశ్యులైరి. సత్య జ్ఞాన సభ ప్రకృతి వివరణ అని స్వామి వారు చెప్పుచుండిరి.

ఆంతరంగికములో చూడవలసిన అనుభవములనే బాహ్యములో సత్య జ్ఞాన సభలో భావనా రూపములో చూపబడినది. మనలోని అరుట్పెరుం జ్యోతి మాయా తెరలచే కప్పబడియున్నది. వాటిలో ప్రధానమైనవి వేరు వేరు వర్ణములలో ఉన్న 7 తెరలు. మనలో ఉన్న అజ్ఞానమను ఈ తెరలు తొలగినపుడు, అరుట్పెరుం జ్యోతిని దర్శించగలము. ఇదే దీని సారాంశము. ఆంతరంగికమున తాము పొందిన అరుట్పెరుం జ్యోతి అనుభవమును, బాహ్యములో సభ రూపములో స్వామి వారు నిర్మించిరి.

సన్మార్గ జెండా - (22-10-1873):

వాళ్లలార్ తమ మార్గమునకు ఒక ప్రత్యేకమైన జెండాను కనుగొంటిరి. ఈ జెండాకు సన్మార్గ కొడి (సన్మార్గ జెండా) అను పేరు కలదు. పసుపు, తెలుపు రంగులలో ఉన్న ఈ జెండాను, మేట్టుకుప్పము, సిద్ధి వళాగ ప్రాంగణములో, 1873 వ సం అక్టోబర్ 22 వ తేదీన మంగళవారము, ఉదయము 8 గంటలకు మొట్టమొదటి సారిగా, జెండాను కట్టి ఆవిష్కరించిరి. ఆ తరువాత ఒక గొప్ప ఉపన్యాసము చేసి అనుగ్రహించిరి. వాళ్లలార్ శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారి సంపూర్ణ  సిద్దాంతములను పొందుపరచిన ఆ ఉపదేశము మహోపదేశము - పేరుపదేశము అని చెప్పబడుచున్నది.

మరణము లేని మహర్జీవితము - రామలింగ స్వామి వారి అదృశ్యము (30-01-1874):

శుద్ధ సన్మార్గము యొక్క అంతిమ లక్ష్యము మరణమును జయించుటయే. మరణమును జయించిన వాడే సన్మార్గి అనునది స్వామి వారి ఉపదేశము.

"என் மார்க்கம் இறப்பொழிக்கும் சன்மார்க்கம் தானே"

"నా మార్గము, మరణమును నిర్మూలించు సన్మార్గమే కదా"

అనునది స్వామి వారి వాక్కు. వాళ్లలార్ శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారు శుద్ధ దేహము, ప్రణవ దేహము, జ్ఞాన దేహము అను త్రిదేహ సిద్ధిని పొందిరి. దేహ సిద్ధి పొందిన వారి శరీరము సమాధి కాజాలదు. వారి భౌతిక శరీరము కాంతి స్వరూపముగా మారును. నిత్య దేహము పొందెదరు.

అట్టి నిత్య దేహమును పొందిన శ్రీ జ్యోతి రామలింగ స్వామి, 1874 వ సం జనవరి నెల 30 వ తేదీన శుక్రవారము పుష్యమి నక్షత్రమున అర్థరాత్రి 12 గంటల సమయమున సిద్ధి వళాగమున తమ గది లోనికి ప్రవేశించి అదృశ్యమైరి.

அருட்சோதி ஆனேன்என்று அறையப்பா முரசு 
          அருளாட்சி பெற்றேன்என்று அறையப்பா முரசு
     மருட்சார்பு தீர்ந்தேன்என்று அறையப்பா முரசு
          மரணந்த விர்ந்தேன்என்று அறையப்பா முரசு. "

అనగా,

" అనుగ్రహ అఖండ జ్యోతి (అరుట్పెరుం జ్యోతి) అయ్యాను నేను
  అనుగ్రహ పాలన పొందాను నేను
  అజ్ఞానమను అంధకారమును నిర్మూలించితిని నేను
  మరణమును జయించాను నేను "

காற்றாலே, புவியாலே, ககனமதனாலே,
கனலாலே, புனலாலே, கதிராதியாலே,
கூற்றாலே, பிணியாலே, கொலைக் கருவியாலே,
கோளாலே, பிறவியற்றுங் கொடுஞ்செயல்களாலே,
வேற்றாலே, எஞ்ஞான்றும் அழியாத விளங்கும்
மெய்யளிக்க வேண்டும் என்றேன் விரைந்தளித்தான் எனக்கே "

అనగా, 

" గాలి వలన గానీ, భూమి వలన గానీ, గగనము వలన గానీ,  
అగ్ని వలన గానీ, నీరు వలన గానీ, సూర్యుడు మొదలైన వాటి వలన గానీ,
మరణము వలన గానీ, రోగము వలన గానీ, మారణాయుధముల వలన గానీ, 
గ్రహ ఫలముల వలన కలుగు చెడు వలన గానీ, 
మరి వేరొక విధమునైననూ, ఎన్నడునూ నశింపక శాశ్వతముగా ఉండు 
శరీరమును అనుగ్రహించమని కోరితిని, తక్షణము దానిని నాకే అనుగ్రహించెను.
ఓ జనులారా! దీనిని అల్పమనుకొన వద్దు. నా అరుట్పెరుం జ్యోతి యందు శరణు పొందుము. "  















   




Tuesday, June 9, 2015

వళ్ళలార్ శ్రీ జ్యోతి రామలింగ స్వామి - పరిచయము




వళ్ళలార్ అని ప్రముఖముగా అందరిచే పిలువబడే శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారు పొందిన ఆధ్యాత్మిక అనుభవములు, వాటి లోతులను పరిగణించినచో  వారు 19 వ శతాభ్థపు యోగులు, ఋషులందరిలో ప్రాముఖ్యులు మరియు వారు తమ అంతరాంతరము, అంతరము, బాహ్యాంతరము మరియు బాహ్యములలో దైవత్వాన్ని అనుభవించి తెలుసుకొన్నారు.

వళ్ళలార్, అరుట్పెరుం జ్యోతి అను దయామయ అఖండ జ్యోతి యొక్క కృపచే తాము పొందిన అమరత్వమును (మరణమును జయించడం) స్పష్ట్టముగా పునరుద్ఘాటించిరి. 

దైవత్వమును పొందుటకు మరణమును జయించి నిత్య ఆనంద జీవితము పొందుట అవశ్యమని ప్రజలకు ప్రభొధించిరి. తన ఆత్మ   అంతయూ అంతులేని ప్రేమ, కారుణ్యములతో నిండిన ఒక మహా పురుషుడు. దైవ జ్ఞానము మరియు మరనరహిత భౌతిక దేహమును పొందగలిగే విజ్ఞానమును పొందిన సత్య చైతన్య మూర్తి. మరణమును జయించి, ముద్ధేహ సిద్ధిని పొంది, పంచకృత్యములనబడే సృష్టి, స్థితి, నాశనము, అదృశ్యము మరియు అనుగ్రహములను తానే స్వయముగా చేయగల శక్తిని పొందిరి. దీనిని ఆయనే స్వయముగా తాము వ్రాసిన " అగవల్  " అను గ్రంథములో వ్రాసి ఉన్నారు. 

" ఉలగుయిర్ తిరళ్ ఎలాం ఒళినెరి పెట్రిడ ఇలగుం ఐంతొయిలయుం యాన్ సెయ తందనై "

అనగా,

" ప్రపంచమున ఉన్న సకల ప్రాణులు దివ్య వెలుగుని పొందుటకు పంచకృత్యములను నేను చేయునట్టు చేసితివి "

వళ్ళలార్ శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారు రచించిన " తిరు అరుట్పా " అను పద్య రచన 6 భాగములు కలిగి ఉన్నది. వాటిలోని 6 వ భాగము ఆధ్యాత్మిక చరిత్రలోనంతటికీ అసమానమైనది. సత్య జ్ఞానా లోకము దానిని మించిన జ్ఞాన అనుభవములు, దేహము యొక్క పరివర్తన మరియు భౌతిక అమరత్వమును గురించి ఆయన వివరించి ఉన్నారు. 

ఇది కాక, ఆయన బహుముఖ ప్రజ్ఞాశీలి. ఆయన ఒక విమర్శకుడు, రచయిత, ప్రచురణ కర్త, వ్యాఖ్యాత మరియు ముఖ్యముగా మూలికలు మరియూ ఆకుల పోషక మరియు వైద్య విలువలు, రహస్యాలు, రసవాదం, జ్యోతిష్య శాస్త్రం మరియు వైద్యములో అపార జ్ఞానము కలిగి ఉంటిరి. ఆయన ఒక గొప్ప సంగీతకారుడు. ఆయన ఆధ్యాత్మిక అనుభవములను, సత్య జ్ఞానమును పాటల రూపములో రచించి, ఆయనే స్వయముగా స్వరపరచి అందరికీ సులభతరముగా వివరించి ఉన్నారు. ఇలా అన్ని కళలయందు ఎటువంటి విద్యాభ్యాసము లేకనే ప్రావీణ్యత పొందినది ఆయనకు కలిగిన దైవానుగ్రహము వలనే. ప్రపంచములోకెల్ల ఉన్నత జ్ఞానమగు అమరత్వమును పొందిన  జ్ఞాన మూర్తి వళ్ళలార్ శ్రీ జ్యోతి రామలింగ స్వామి. 

Sunday, June 7, 2015

అమరత్వము

ధర్మము విఫలమై, ప్రపంచమున చెడు ప్రబలినపుడు, దానిని నిర్మూలించి ధర్మ రక్షణ చేయుటకు భగవంతుడు అవతరించడం లేక మానవ రూపములతో ప్రత్యక్షమై ధర్మ రక్షణ గావించి అద్రుశ్యమవడం జరుగును. ఇది అన్ని మత గ్రంధములు మరియూ పురాణములలో చెప్పబడి ఉన్నది. మరోవైపు మానవుల యొక్క దుఃఖాన్ని వారి దురభిప్రాయములను మార్చి ఆ భగవంతుడిని చేరుకొనుటకు గల దారిని చూపుటకు ఎందరో మహర్షులు, దివ్య పురుషులు జన్మించి మార్గ దర్శనములు చేయుచున్నారు. కానీ వారి వారి సామర్థ్యానికి అనుగుణంగా కొందరు అక్కడితో ఆగిపోయి మరికొందరు అక్కడితో వారి ప్రయాణమును నిలుపుకొని ఉన్నారు. వారి అనుచరులు వారి గురువులు నిర్దేశించిన మార్గమును అనుసరించుచూ మానవాళికి అనిశ్చితివైపుకి దారి చూపుచున్నారు.  శరీరము శాశ్వతము కాదు, భగవంతుడిని చేరుకొనుటకు  శరీరమును వదలవలెను అనే అభిప్రాయమును కలిగి ఉండుటయే దీనికి కారణము.

కానీ నిజము భిన్నంగా ఉంటుంది. భగవంతుడు శాశ్వతమైనవాడు. అతని ఉనికి ప్రపంచమంతటా ప్రతి అణువులోనూ వ్యక్తీకృతమై ఉన్నది. మన భౌతిక శరీరము ఆకాశము, భూమి, అగ్ని, నీరు మరియూ వాయువు అను పంచ భూతముల యొక్క మూలకముల ఫలితమే. అట్టి భౌతిక శరీరములోనే భగవంతుని ప్రాభల్యమును సంపూర్ణముగా తెలుసుకొనగలము. మంచి, చెడుల మధ్య గల బేధమును గుర్తించి ఉన్నత జీవితమును జీవించుటకు కావలసిన తార్కిక మనస్సు మానవునికి తప్ప మరి ఏ జీవి కి లేదు.  

ఇందు మూలముగా మానవ శరీరములోనే ఆ భగవంతుని రూపము సాకారమై మరియూ దాని పర్యవసానముగా దైవ అనుగ్రహము పొంది మానవుడు నిత్యము జీవించగలడు. ఈ సూత్రము సాధారణముగా కనిపించినప్పటికీ, ఇంకా మానవాళి మరణమును జయించి నిత్య జీవితము పొందుటకు కావలసిన పరిపక్కువతను పొందలేదు. ఇందుకు ప్రధాన కారణము మానవుడు సరియైన మార్గమును ఎంచుకొనలేదు మరియూ ఆ పరిస్థితులవైపు అతనిని నడిపించి మార్గ నిర్దేశము చేయుటకు ఎవరూ లేరు. ఇప్పటి వరకు మానవుడు భగవంతుడిని భౌతిక శరీర స్థాయి నుండే వీక్షించుచూ తాను భగవంతుడి నుండి వేరు చేయబడి ఉన్నాడని నమ్ముతున్నాడు. దీర్ఘ కాలములో భగవంతునిలో లీనమై అతని లక్ష్యమును చేరుకోనవచ్చని నిరీక్షించుచున్నాడు. 

 దాదాపు అన్ని మతములు మానవుడు మరియు దైవము వేరు అనే ద్వైత సిద్దాంతమునే ప్రభోదించుచున్నది. ఆత్మ, భగవంతుడు మరియు భాగముల (శరీరము మరియూ  ప్రపంచము) గురించిన నిజమైన జ్ఞానము లేక మనము అజ్ఞానాంధకారములో సంచరించుచున్నాము. 

అందువలన జీవితము యొక్క పరిపూర్ణత అంతరాంతరముల నుండి వచ్చునని తెలుసుకొనుచున్నాము. ప్రపంచము దీనిని ఒక కొత్త సిద్ధాంతముగా కనుగొనవచ్చు. కానీ ఇది సత్యము. మతము పేరుతో, సమాజము మత ఘర్షణలు, మత యుద్ధములు మరియు కుల వ్యవస్థ లోకి లోతుగా పాతుకు పోయింది. ఇది సత్యమును గ్రహించుటకు కష్టసాధ్యము చేసినది. 

అతి కష్టముల మధ్య మరణమును జయించి అమరత్వ నిత్య జీవితమును అందరికి సుసాధ్యము చేసి దానిని భగవంతుని చిత్తముగా స్థాపించి సర్వ మానవాళికి ఇది సాధ్యమే అని చాటి చెప్పిన ఒక మహోన్నత వ్యక్తి, దివ్య పురుషుడు శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారి గురించి తెలుసుకొనుచున్నాము. విధిని మించిన శక్తి లేదని ప్రపంచమంతయూ నమ్ముచున్నది. మరణమను విధిని జయించలేమని నమ్ముచున్నది. 


ఇప్పుడు ఈ లోతైన నమ్మకము తిరస్కరించబడి మానవుడు మరణమును జయించి నిత్య జీవితము పొందుటకు సమయము ఆసన్నమైనది. 

Wednesday, April 8, 2015

శారీరక శాశ్వతత్వము గురించి వళ్ళలార్ శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారి ముఖ్య భోధనలు

1. మరణము మన నిర్లక్ష్యము.
2. మరణము ప్రకృతి సత్యమునకు వ్యతిరేకము.
3. అందరిలా భౌతికముగా నశించువాడు ఒక శుద్ధ సన్మార్గి కాజాలడు.
4. మన శాశ్వత గృహము మరణము లేని మన భౌతిక శరీరమే.
5. ఎవరైతే వారు స్వయముగా ముద్దేహ సిద్ధిని (శుద్ధ, ప్రణవ మరియూ జ్ఞాన దేహములు) పొందుదరో, వారే             సంపూర్ణ జ్ఞానము పొందిన మానవులు కాగలరు.
6. మన చుట్టూ మనలో అంతటా ప్రకృతి నిండి ఉన్నది ఎందుకనగా
ఈ నిత్య దేహములో ఆత్మానందము నిత్యమూ పొందుట కొరకే.
7. మరణమును జయించుట ఎవరికైతే తెలియదో, వారికి నిజానికి ఏమియూ తెలియదు.
8. మనకు అవసరమైనవి అన్నీ ఇక్కడ ఉన్నది. కనుక మరణమును జయించి మన భౌతిక శరీరములో నిత్య జీవనం పొందుట కొరకు త్వరపడవలెను.
9. జీవము ఆత్మపై ఆధారపడి ఉన్నది. కానీ. జీవము మరియూ ఆత్మ రెండునూ భౌతిక దేహముపై ఆధారపడి ఉన్నది. కనుక దానిని మన శాశ్వత గృహముగా చేసుకొనవలెను.
10. భౌతిక శరీరము అబద్ధమని, అది ఒక నాటికి నశించునని అవివేకులు మాత్రమే నిజమును గ్రహించక చెప్పుదురు.
11. ఆత్మకు ఈ విశ్వములో నిత్య భౌతిక దేహము తప్ప మరి ఏదీ అవసరము లేదు.
12. భగవంతుడిని చూడ దలచిన వాడు, ఎన్ని జన్మలకైననూ చూడలేక పోవచ్చును. కానీ, భౌతిక అమరత్వమును గురించి ప్రయత్నించువాడు ఈ జన్మలోనే కచ్చితముగా ఆ భగవంతుడిని చూడగలడు.
13. ఆ భగవంతుడు ఎప్పుడూ మన మరణమును కొరుకొనడు. నిత్యమూ జీవించవలెననే కోరుకొనుచున్నాడు. ఎందుకనగా ఆయన మనతో నిత్యమూ ఉండుటకే ఇష్టపడుతాడు.
14. ప్రకృతి చేతిలో ఉన్న మన జీవితం, మన చేతికి వచ్చుట వరకు, ప్రతి క్షణమూ అనిశ్చితమే. మరు క్షణం ఏమి జరుగునో తెలియదు. కనుక, ఈ క్షణము నుండే ఆ ముద్దేహ సిద్ధిని (శుద్ధ, ప్రణవ మరియూ జ్ఞాన దేహములు) పొందుటకు కృషి చేయవలెను.
15. జన్మించుట మరణించుట కొరకా?
16. ఆరోగ్యకరమైన భౌతిక శరీరము, తెలివి, జ్ఞానము, కారుణ్య భావన, దేవుని కృప వంటి గొప్ప దివ్య బహుమతులతో, నిజముగా మరణించాలని అనుకొనుచున్నారా? ఈ దివ్య బహుమతుల యొక్క ప్రయోజనమును తెలుసుకొనుటకు ప్రయత్నించండి.
17. ముందు భౌతిక అమరథ్వమును పొందగలమని నమ్మవలెను. అప్పుడే దాని సత్యమును ఆ భగవంతుని కృపతో అనుభవించగలము.
18. అమరత్వము సత్యమేనని అందరికీ తెలియజేయవలెను. దీనిని నిరూపించుటకు ఆ దేవుడు కానీ నేను కానీ అవసరము లేదు. నమ్మకము చాలు. మరణమును జయించి, ముద్దేహ సిద్ధి పొందిన వారు, తమ భుజము పై వస్త్రమును కింద పారవేసిన, అదియే మరణించిన వారిని లేప గలదు.
19. అమరత్వము కంటే ఏది ఎక్కువ? కనుక దానిని మీ జీవితములో మొదటి ప్రాధాన్యతగా చేసుకొనవలెను.
20. ఆహారము, లైంగిక సంభోగము, నిద్ర మరియు భయములే మరణమునకు కారణములు. మరణమును జయించుట కొరకు, అన్ని విధములైన భయములనుండి విముక్తి పొంది, ఆహారము, సంభోగము మరియు నిద్రల యందు జాగ్రత్త వహించవలెను. ముఖ్యముగా సంభోగమునందు.

దివ్య జ్ఞాన దేహముతో వళ్ళలార్ శ్రీ జ్యోతి రామలింగ స్వామి 

Thursday, February 26, 2015

నిత్య జీవనం - సత్య జీవనం

సర్వశక్తి గల పరమాత్మ యొక్క ఉనికి రెండు అంశములలొ శాశ్వతముగా కలదు. మనము ఏదైతే బాహ్య ప్రపంచమున చూచి అనుభవించుచున్నామో అది ఆయన వెలుపలి అంశ. ఈ ప్రపంచము యొక్క కారణ ప్రభావములే ఆ పరమాత్ముని అంతర్గత అంశ. ఈ రెండు అంశలూ శాశ్వతమైనప్పటికీ, వేలుపలిది ఎప్పుడూ కనిపించునదిగానూ మార్పు చెందునదిగానూ, అంతర్గతమైనది కళ్ళకు కనిపించని మార్పులేనటువంటిదిగానూ ఉన్నది. ఆ పరమాత్ముని శక్తి అంతరాంతరమునుండి నిత్యం అన్నింటినీ వ్యక్త పరచి, లయపరచి తిరిగి సృష్టించుచూ ఉన్నది. మానవుడు తన ఇంద్రియ, తర్క, భౌతిక, యాంత్రిక జ్ఞానములతో తన బాహ్యాంతరంగములలో ఏది నిజమో తెలుసుకొనలేక సతమతమౌతున్నాడు. విజ్ఞానము మరియు అన్ని తత్త్వశాస్త్రములు ఈ రెండింటిలోనూ తమ ప్రయత్నములను చేయుచూ సత్యమును గ్రహించుటకు ప్రయత్నించుచున్నది. విజ్ఞాన శాస్త్రజ్ఞులు తమ ప్రయత్నముతో చంద్రుడు మరియు ఇతర గ్రహాల వరకు వారి పరిశోధనను కొనసాగించుచూ నక్షత్ర మండలమునకు చేరుకోనుచున్నారు. ఆధ్యాత్మికవేత్తలు, తత్వవేత్తలు మరియు యోగులు అంతర్ముఖులై ఆ పరమాత్ముని దివ్య శక్తిని అనుభవించుచున్నారు.

శాశ్వతమైన ఆత్మ యొక్క ఈ అంతర్ముఖ అనుభవముతో ఆ పరమాత్ముని రెండు అంశముల గురించిన జ్ఞానము వెలుగులోనికి వచ్చినది.

అణు శాస్త్రము విద్యుదయస్కాంత శక్తి ద్వారా కొంత అణు శక్తిని కనుగొనగలిగినది. కానీ ఇది సంపూర్ణమైన దైవ శక్తి కాదు. భౌతిక అణువు యొక్క కేంద్రము నుండి ప్రాణశక్తి వెలువడినప్పుడు, ఆ అణువు చుట్టూ భౌతిక శరీరము ఏర్పడును. ఆ ప్రాణశక్తితో పాటూ, ఇంద్రియ జ్ఞానములూ అభివృద్ది చెంది మనసు, బుద్ధి సృష్టించబడును. ఈ బుద్ధికి తత్త్వ జ్ఞానము అనుగ్రహించబడి మానవుడు తన బాహ్యము మరియు అంతరంగములలోని సత్యమును అన్వేషించుచున్నాడు. ఇక్కడ గ్రహించవలసినది పైన చెప్పబడిన అన్ని జ్ఞానములు, శక్తులు ఒక అణువు యొక్క కేంద్రము నుండి వెలువడినదే.



ప్రాణశక్తిని వెలువరించే ఆ అణువు మానవ దేహములో శిరస్సు మధ్యన ఆ మానవుని జీవిత కాలము అంతయూ ప్రకాశించుచూ ఉండును. ఆ అణువు యొక్క ప్రకాశము మరియు ప్రాణశక్తిని ఒక దివ్య శక్తి నియంత్రించుచున్నది. యోగులు, ఋషులు తమ తపో ఫలములతో దానిని తెలుసుకొని, అదియే ఆత్మ అణువు, ఆత్మ అని భాహిర్గతపరిచారు. ఈ ఆత్మ అణువే పరమాత్మ యొక్క శాశ్వత నివాసము. ఈ ఆత్మ అణువే జీవాత్మగానూ  పరమాత్మగానూ ఉన్నది. అనునిత్యమూ సర్వాంతర్యామిగా పరమాత్మ ఈ అణువునుండి ప్రపంచమునంతయూ పరిపాలించుచున్నాడు.

పైవిషయమునుండి ఈ ఆత్మాణువే పరమాత్ముని శాశ్వత నివాసము అని గ్రహించుచున్నాము. సర్వాంతర్యామి అగు ఆ పరమాత్మ అన్నింట తన ఉనికిని ప్రదర్శించుచున్నాడు. మానవుడు  అంతర్ముఖుడై పయనించినపుడే దీనిని గ్రహించగలడు.

పరమాత్మ తప్ప ఇక ఏదీ లేదు. నిత్యమూ అంతరంగమున మార్పు చెందక మరియూ బాహ్యమున మార్పు చెందుచూ ఉన్నది ఆ పరమాత్మయే. అందువలనే, మానవుని లోని ఆత్మ మరియు శరీరము ఆ పరమాత్ముడు తనను తాను వ్యక్త పరచుకొనిన విషయములే. ఇప్పటివరకూ మానవుడు తన జీవితము అనిత్యమైనదిగా ఊహించుకుంటున్నాడు. ఒక యోగ తర్కవాది కూడా తనకున్న ఆత్మ జ్ఞానముతో తాను ఒక ఆత్మనని, ఆత్మ జ్ఞానము పొంది ముక్తి చెందుట కొరకే ఈ భౌతిక దేహం తనకు ఇవ్వబదినదని అది అశాస్వతమని అనుకొనుచున్నాడు.

ఈ ఆత్మాణువు, జీవాత్మ మరియు పరమాత్మకు ఒక్కటే. ఉన్నతమైన దివ్య ఆత్మ అనుభవములలో, జీవాత్మ, పరమాత్మ, అనగా దైవం, మానవుడు ఒక్కటే. కానీ జీవునిలోని ఆత్మ అహంకారం, కర్మం, మాయ అను త్రిదోషములతో కప్పబడిఉన్నది. దీనిని జయించి ఆత్మసాక్షాత్కారం ఆపై పరమాత్మ సాక్షాత్కారం పొందవలెను.  ఇంద్రియ జ్ఞానము గల జీవితమును పరిశుధమైన దైవ జీవనముగా మార్చుకొని, స్వచ్చమైన ప్రేమ కలిగి జీవించవలెను. ఆ సర్వశక్తి గల పరమాత్ముని కృపతో ఈ దైవ మానవుడు నిత్య జీవితమును పొంది జీవించును.

పరమాత్ముని నిత్య జీవితం మానవునికి గల దివ్య హక్కు. ఈ దివ్య హక్కును గురించి ఎరుగక, దానిని విస్మరించడం దైవ సంకల్పం కాదు.

మరణము మానవుని అంతము కాదు. మరణములో భౌతిక శరీరము మాత్రమే నశించును. భౌతిక మరణానంతరం ఆత్మ వేరొక శరీరమును ఎంచుకొని మళ్ళీ పుట్టును. ఆత్మ తన భౌతిక కాయమును వదిలి వేరొక శరీరములో మళ్ళీ పుట్టుటకు కొంత కాలముఆలస్యమగును. ఆ కాలము మన కర్మానుసారం నిర్ణయింపబడును. ఆ మధ్య కాలమున ఆత్మ, పుణ్యాత్మ అయినచో వారి శిష్యులు, అనుచరులు, భక్తులను దీర్ఘకాలము వరకు రక్షించుచూ, మార్గనిర్దేశం చేయుచూ  ఉండును. కానీ, ఈ విధముగా ఒకరు ఉన్నతమైన నిత్య జీవనము పొందలేరు. దేహమును వదిలినచో మళ్ళీ జననము తప్పదు. ఇదే పునరపి జననం పునరపి మరణము.

పరమాత్మను దర్శించి పరమానందముతో మరణము లేని నిత్య జీవితం పొందగలడు. చిరంజీవి అయి జీవించగలడు. మరణ రహిత మరియు ఆనంద జీవనం మానవుని లక్ష్యము. ఈ జీవితం మానవుని ఆత్మ/అంతర్గతమునుండి తన ప్రయాణమును మొదలుపెట్టును. ప్రపంచములోని అన్ని మార్గములు బోధించు ఆత్మజ్ఞానమును పొంది ఆపై మరణమును జయించి భౌతిక నిత్య దేహమును పొంది చిరంజీవులుగా జీవించుటయే పరమాత్మ సంకల్పము.

" వేదములలో మరణమును జయించి నిత్య జీవనం పొందుటను గురించి చెప్పబడి ఉన్నది. "
- శ్రీ జ్యోతి రామలింగ స్వామి

మరణమును జయించి నిత్య జీవనం పొందుట గురించి శ్రీ రామలింగ స్వామి వారి గ్రంధములు మనకు బోధించుచున్నవి. 

Monday, February 16, 2015

నాలుగు దశలు

మన జ్ఞానులు మానవుడు దైవత్వమును పొందుట కొరకు నాలుగు దశలను నిర్దేశించినారు.

అవి,

         1. చర్య
         2. క్రియ
         3. యోగము
         4. జ్ఞానము

1. చర్య :

చర్య అనునది పరిశుభ్రముగా  స్నానము ఆచరించి, ఆలయమునకు వెళ్లి దైవ దర్శనం మరియు ఇతర పుణ్య కార్యక్రమములు చేయుట.

ఆలయ దర్శనం మొదటి దశ. దైవమును గూర్చి తెలియని చిన్నారులకు దైవమును పరిచయము చేయుట. దైవమునకు వివిధ రూపములను ఏర్పరిచిరి. వాటికి పురాణ గాధలు, ఉత్సవములు ఏర్పరిచి, ఆ దైవ తత్వము మనకు సులభముగా అర్థముగుటకు కృషి చేసిరి.

వారు రూపొందించిన ప్రతి విషయమునకు ఒక తత్వము కలదు. మానవ శరీరమునే ఆలయముగా నిర్మించిరి. దైవ స్వరూపములలో, పురాణ గాధలలో తత్వమును, జ్ఞానమును ఉపదేశించిరి. మానవుడు ఈ సమాజములో జీవించుటకు కొన్ని మంచి నియమములను నిర్దేశించిరి.

2. క్రియ:

మానవుడు అంతరంగమున తాను అభివృద్ధి చెందినపుడు, ఆలయమునకు వెళ్లి ప్రార్థించుటకనిన ఇంకనూ దైవమును సమీపించాలన్న ఆకాంక్ష పెరుగును. అప్పటివరకు ఆలయములో భక్తునికి, భగవంతునికి మధ్య అర్చకుడు అని ఒకరు ఉన్నారు. భక్తుడు తాను చెందిన పరిపక్కువత కారణముగా తానే స్వయముగా పూజ చేయవలెనని తానే కీర్తనలు పాడి, తన దైవమునకు స్వయముగా తానే సేవలను చేయవలెను అనే కోరిక కలుగును.

భక్తుడు తన గృహమున తన ఇష్ట దైవము యొక్క ప్రతిమను ప్రతిష్టించి తన మనసునకు తోచిన విధముగా పూజలు చేసి ఆనందించును. కీర్తనలు, స్తోత్రములు పాడి పరవశించును. భగవంతునికి భక్తునికి మధ్య వేరొకరు రావడం ఈ స్థితిలో తాను అంగీకరించడు.

మొదటి దశలో అన్ని పుణ్యక్షేత్రములను దర్శించి, పుణ్య నదులలో స్నానములు ఆచరించి, ప్రార్థించిన భక్తుడు, రెండవ దశలో పుణ్య క్షేత్రములు దర్శించి ప్రార్థించుటను తగ్గించి, తానే స్వయముగా పూజలు చేయుటకు ఆశక్తి చూపును. అభిషేకం, ఆరాధన, అలంకారం, యజ్ఞం, హోమం మొ అనేక క్రియలలో నిమఘ్నమై ఆనందించును. దీనినే క్రియ దశ అని అందురు.

3. యోగం:

మూడవ దశ యోగం. మొదటి దశలో ఆలయమును దర్శించి, ప్రార్థించిన భక్తుడు, రెండవ దశలో తానే పూజలు, హోమములు చేసిన కర్మ సాధకుడు, ఇంకనూ కొంచెం ఆలోచనా జ్ఞానము పెరిగినప్పుడు, మనము శిల్పములను, లోహములనే ఇప్పటి వరకు పూజించుచున్నాము. మన పూర్వీకులచే సాక్షిగా నిర్ధేశించబడినవే కదా ఇవి అని ఆలోచించునప్పుడు, వాటిని, వాటిని వివరించు, వివరింప జేయు గురువులను అన్వేషించును.

మొదటి తరగతిలో బాగా చదివి ఉత్తీర్ణులైన వారు రెండవ తరగతికి పంపబడుతారు. అక్కడనూ బాగా అభ్యసించి ఉత్తీర్ణులైనచో, మూడవ తరగతికి పంపబడుతారు. ఈ విధముగా భగవంతుడు, తన భక్తుడికి తరువాతి దశలను అనుగ్రహిస్తాడు.

మూడవ దశ చేరి, తగు దిశ తెలియక సంచరించు వాడు, ప్రాణాయామం మొదలగు యోగములను చేసి ప్రయత్నించును. పంచ భూతములలో ఒకటైన వాయువును గూర్చి అనేక యోగ సాధనములు చేయును. తీవ్ర వైరాగ్యము కల వారికి కొన్ని సిద్ధులూ ప్రాప్తించును.

మానవుడు  భక్తునిగా, కర్మ సాధకునిగా, తరువాత యోగిగా అగును.

4. జ్ఞానం:

చివరిగా, నాలుగవ దశ అయిన జ్ఞానం అంతిమ దశ. తాను ఎవరు అని సాధకుడు గ్రహించునది. ఇదే మనము పొందవలసినది అని పరిపూర్ణముగా గ్రహించవలెను.

ఆ పరమాత్మ వద్దకు మనలను తోడ్కొని పోవు మార్గము ఈ జ్ఞాన మార్గము.

భక్తునిగా, కర్మ సాధకునిగా, యోగిగా, పరిపక్వం చెందినవాడు, అంతిమముగా, ఆ పరమాత్మను తన లోనే దర్శించి, అనుభూతి చెంది, స్పష్టత పొంది తనను తాను తెలుసుకొని, సన్మార్గమున పయనించి ఆ పరమాత్మలో లీనమగుట మరణమును జయించుట - దేహము నశింపకుండుట - జనన మరణములను చక్రము నుండి విముక్తి పొంది నిత్య చిరంజీవులుగా జీవించవలెను. మరణమును జయించి అమరత్వమును పొందుటయే మానవుని లక్ష్యము.

చర్య          -      దేహ శుద్ధి , ఆలయ దర్శనము
                        భక్తుడు, దాశ మార్గము

క్రియ         -      అష్టాంగ పూజా విధానములను తానే స్వయముగా చేయుట
                        కర్మ సాధకుడు, సత్త్పుత్ర మార్గము

యోగము  -      ప్రాణ వాయువుని బంధించి సాధన చేయుట
                        యోగి, సహ మార్గము

జ్ఞానము    -      తాను ఎవరినో గ్రహించి, పరమాత్మ సాక్షాత్కారం పొంది, చిరంజీవులుగా నిత్యం జీవించడం
                        జ్ఞాని, సన్మార్గము 



అందరూ, మళ్ళీ జన్మించని వరము ఇవ్వమని ఆ భగవంతుడిని ప్రార్థించుదురు. ఇప్పటి వరకూ వచ్చిన మహానుభావులు అందరూ మరు జన్మ అనునది లేకుండా వరము ప్రసాదించమని కోరుకున్నారు. కానీ, వడలూరు శ్రీ జ్యోతి రామలింగ స్వామి, ఆ పరమాత్మ యందు మరణము లేని నిత్య జీవితమును ప్రసాదించమని కోరెను. మనము ఇది వరకే పుట్టి ఉన్నాము. ఈ జీవితము సమాప్తి చెందిన తరువాతనే కదా మరు జన్మ, మళ్ళీ పుట్టుట సంభవించును. ఈ జీవితమునే నిత్య జీవితముగా, మరణము లేని జీవితముగా చేసిన యెడల, మళ్ళీ పుట్టుట, మరు జన్మ గురించి ఆలోచించుట అనునది అవసరము లేదు. అందువలనే అందరికన్నా ఒక స్థాయి పైకెళ్ళి ఆ పరమాత్మ వద్ద మరణము లేని జీవితం, అమరత్వమును ప్రసాదించమని ప్రార్థించెను. తన ఒక్కడికి కాక, ఈ మానవ జాతి అంతయూ  దీనిని పొందవలెనని భగవంతుడిని ప్రార్థించెను. ఆ మహా పురుషుని కరుణా హృదయమునకు మనము ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉండవలెను.

చర్య, క్రియ, యోగం, జ్ఞానం అను ఈ దశలు, ఒక్కొక్కటి నాలుగు భాగములుగా విభజింపబడి, 16 దశలుగా శాస్త్రములు చెప్పుచున్నవి.

1.   చర్యలో చర్య
2.   చర్యలో క్రియ                       - చర్యలో ముక్తి సాలోక పదవి
3.   చర్యలో యోగం
4.   చర్యలో జ్ఞానం

5.   క్రియలో చర్య
6.   క్రియలో క్రియ                       - క్రియలో ముక్తి సామీప పదవి
7.   క్రియలో యోగం
8.   క్రియలో జ్ఞానం

9.   యోగములో చర్య
10. యోగములో క్రియ                 - యోగములో ముక్తి సారూప పదవి
11. యోగములో యోగం
12. యోగములో జ్ఞానం

13. జ్ఞానములో చర్య
14. జ్ఞానములో క్రియ                   - జ్ఞానములో ముక్తి సాయుచ్య పదవి
15, జ్ఞానములో యోగం
16. జ్ఞానములో జ్ఞానం

" ముక్తి అనునది ముందగు సాధనము
  సిద్ధి అనునది నిత్య అనుభవము "       - శ్రీ జ్యోతి రామలింగ స్వామి

 శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారు, ఆయనకు జీవులపై గల కరుణచే, 13 వ దశగా ఉన్న జ్ఞానములో సరియ నుండి మనకు బొధించిరి. అనగా ఏ స్థాయి లో ఉన్నవారైననూ ఈ 13 వ దశ నుండి వారి జ్ఞాన సాధనమును కొనసాగించవచ్చు. జ్ఞానము పొందుటకు అభిరుచి, ఆశక్తి ఉన్న వారు ఎవరైనా ఈ 13 వ దశలోనికి ప్రవేశించుటకు అర్హులే అని స్వామి వారు మన అందరినీ ఆహ్వానించుచున్నారు.




Sunday, February 8, 2015

దేవాలయములు మనకు ఏమి సూచిస్తూ ఉన్నది?

ఆత్మ సాధన లో మనము ముందు తెలుసుకోవలసినది "నేను ఎవరిని?" అని. నేను ఎవరు అని తెలుసుకొనునదే జ్ఞానం. జీవాత్మయగు తనను తెలుసుకొనిన వాడే, ఆ పరమాత్మను తెలుసుకొనగలడు.

ప్రతి అణువులోనూ ఉన్న ఆ పరమాత్మ మన దేహమంతయూ వ్యాప్తి చెంది ఉన్నాడు. మన శరీరములోని ఒక్కో అంగములోనూ ఒక్కో శక్తీ రూపములో వ్యాప్తి చెంది ఉన్నాడు. దీనినే మన పూర్వీకులు బాహ్య ప్రపంచములో వివరింపదలచారు. 

మనలోని ఆ పరమాత్మను బాహ్యములో  భావన చేసి, ప్రార్థించుటకు, ఒక్కో తత్వానికి, శక్తికి, ఒక్కో రూపమును ఇచ్చి ఆ రూపములను దేవతలుగా సృష్టించిరి. ఆ దేవతల కొరకు అనేక దేవాలయములను, ఇతిహాస పురాణములను ఏర్పరచిరి.  ఇందు మూలముగా నిజమును గ్రహించి, జ్ఞానమును పొందుటకు మార్గమును చూపించిరి. 

దేహమే ఆలయము:

మనలోని పరమాత్మను తెలుసుకొని, ఆ పరమాత్మను పొందదలచి, మన శరీరమునే ప్రతిరూపముగా ఉంచి, దేవాలయములను నిర్మించిరి. 


అనగా, పై చిత్రములో చూపించబడినట్టుగా, మన పాదములనే ప్రవేశ గోపురముగా, పది వ్రేళ్ళు ఆ గోపురము పై ఉన్న  కలసములుగా, పురుష అంగం, మూలాధార చక్ర స్థలం ధ్వజస్థంబముగా చెప్పబడినది. నాభి బలి పీటము, పై కడుపు నంది. నంది అనగా మన ఆహారమును జీర్ణము చేయి శక్తి. మన ముఖములోని నోరు, గర్భగుడి లోనికి ప్రవేశ ద్వారము. 

" మన శరీరమంతటికీ శిరస్సే ప్రథానం. " - జ్ఞానుల వాక్కు 

ఆ శిరస్సు మధ్యలో, ప్రకాశవంతముగా, జ్యోతి స్వరూపుడై ఆ పరమాత్మ కొలువున్నాడు. ఇదే మూల స్థానమని పిలువబదుచున్నది. ఈ కారణము వల్లనే శిరస్సు ప్రథానమని ఉపదేసించిరి. శిరస్సు మధ్య కొలువై ఉన్న ఆ పరమాత్మ, మన దేహమంతయూ వ్యాప్తి చెంది ఉన్నాడు. ఆ పరమాత్మ కొలువై ఉన్న ప్రదేశమునే మూలస్థానము, గర్భ గుడి అని చెప్పబడినది. 

ఏ శివాలయములోనైననూ, కుడి ప్రక్కన విఘ్నేస్వర సన్నిధి, ఎడమ ప్రక్కన సుబ్రహ్మణ్య (ఆరు ముఖ) సన్నిధి, ఇంకనూ ముందు భాగమున, ఎడమ వైపున శక్తి (అమ్మవారి) సన్నిధి ఉండును. 

మన దేహములో ఛాతియందు, కుడి వైపున ఐదు తలలతో కూడిన నాడి ఒకటి  కలదు. ఇదే పంచముఖ విఘ్నేశ్వరుడు, ఎడమ వైపున ఆరు తలలతో ఉన్న నాడి కలదు. ఇది మన శరీరములో ఉన్న 72,000 నరములకూ ప్రధానమైనది. ఇదే ఆరు ముఖం (సుబ్రహ్మణ్యం) అని చెప్పబడినది. 

మన ఛాతి యందు ముందు భాగమున, ఎడమ వైపున ఉన్నది హ్రుదయము. ఇది మన శరీరములోని చెడు రక్తమును శుధ్ధి చేసి అన్ని అవయవములకూ రక్తమును ప్రవహింపచేసి అన్ని అవయవములూ సక్రమముగా పని చేయుటకు శక్తిని ఇచ్చును. అందువలనే అమ్మవారిని శక్తి రూపముగా మనము ఆరాధించుచున్నాము. రక్తపు రంగు ఎరుపు కనుక ఆ శక్తిని ఎరుపు రంగులో  సూచిస్తున్నాము. ఆ కారణము చేతనే, అమ్మవారికి కట్టు చీర సైతం ఎరుపు రంగు, అక్కడ ప్రసాదముగా ఇవ్వబడుచున్న కుంకుమ ఎరుపు రంగుతో ఉన్నవి. మన శరీరములో ప్రవహించు రక్తము శక్తి స్వరూపం. శక్తి లేనిదే మనము లేము. ఇందు కారణము చేతనే అనేక మంది శక్తిని ఉపాసించుచున్నారు. 

మహా విష్ణువు హృదయ స్థానములో మహా లక్ష్మి కొలువై ఉన్నది అని చెప్పుట కూడా ఈ కారణము చేతనే !!

Saturday, February 7, 2015

మానవ జన్మ పొందినందుకు మనం తెలుసుకోవలసినది ఏమిటి, పొందవలసినది ఏమిటి?

మానవ జన్మ దైవత్వమును పొందుటకొరకే అని మనము గ్రహించవలెను.

సృష్టి ప్రారంభమునుండి ఒక జ్ఞానము గల ప్రాణి నుండి ఇప్పుడు ఆరు జ్ఞానములు అనగా ఆరవ జ్ఞానమగు ఆలోచనా జ్ఞానము గల ప్రాణి వరకు పరిణతి చెంది ఉన్నాము.


ఈ పరిణామక్రమములో ఇంకనూ పైకెదిగి దైవత్వమును పొందవలెను. ఇప్పటి వరకూ ఈ పరిణామ క్రియను ప్రకృతి తానే స్వయముగా చేయుచూ వచ్చుచున్నది. పరిణామక్రమములో పై మెట్టు ఎక్కి పరిపూర్ణత చెందవలెను. ఈ బాధ్యత ప్రకృతి మనకు అప్పగించినది. మానవునికి సర్వ స్వతంత్రమును ప్రసాదించి పరిణామములో ఉన్నత శిఖరాలను అధిరోహించుట లేక ఇక్కడే ఉండిపోవుట, లేదా ఇంకను పాప కార్యములు చేసి నీచ స్థితులకు పోవుట మన చేతిలో ఉన్నది. 

పరిణామక్రమములో ఉన్నత స్థితులకు వెళ్ళడం అనగా, దైవత్వమును పొందడమే! అనగా, దైవానికి మరణము లేదు. దైవత్వమును పొందినచో మనమూ మరణమును జయించి చిరంజీవులుగా జీవించగలము. ఇది సాధ్యమేనని ఎందరో మహానుభావులు, దివ్య పురుషులు ఇదివరకే రుజువు చేసి ఉన్నారు.  శ్రీ ఆంజనేయ స్వామి ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నారు. మహావతార్ బాబాజీ రెండు వేల సంవత్సరములుగా హిమాలయములలో ఉన్నారు. ఆయన దర్శనం పొందిన ఆయన శిష్యులు ఎందరో వారి అనుభవములను పంచుకుంటున్నారు. తమిళనాడు లోని సిద్ధపురుషులు ఈ అమరత్వమును గురించి వివరించి ఉన్నారు. ఇవి వారి గ్రంథముల నుండి మనకు తెలియుచున్నది. ఈ అమరత్వ విద్య ప్రస్థావన మన వేదము, ఉపనిషత్తులలో కూడా ఉన్నది. ముఖ్యముగా కటోపనిషత్తులో ఈ విద్యను గురించి దీర్ఘముగా చర్చించబడి ఉన్నది. చీనా దేశమునకు చెందిన తావోలు కూడా ఈ అమరత్వమును గురించి ప్రస్థావించి ఉన్నారు. 


అతి సమీప సమయములో అనగా 19 వ శతాబ్దములో తమిళనాడులోని చిదంబరమునకు సమీపములో వడలూరు అను దివ్య క్షేత్రములో శ్రీ జ్యోతి రామలింగ స్వామి మరణమును జయించి త్రిదేహ సిద్ధి అనగా, శుద్ధ, ప్రణవ, జ్ఞాన జ్యోతి దేహములు పొంది, అమరత్వము అందరికీ సాధ్యమే అని చెప్పినారు. మానవులందరికీ ఇది సాధ్యమే అని నిరూపించినారు.

                                                         శ్రీ రామలింగ స్వామి



మానవ జన్మకు సార్థకత ఏమిటి?


పరమాత్మ కృపకు పాత్రులై, ఆ పరమాత్మను దర్శించి, దైవత్వమును పొందుట లోనే ఈ మానవ జన్మకు సార్థకత ఉన్నది. అది లేక ఎన్ని సాధనములు చేసి ఎంతటి గొప్ప విషయములను సాధించినా వ్యర్థమే!

మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణ ఇతిహాసములు, సకల శాస్త్రములు ఏమి బోధిస్తున్నవి?


వేదములు, సకల శాస్త్రములు మనకు బోధించునది పరమాత్మ ఒక్కటే. ఆ పరమాత్మ ప్రేమ మూర్తి, జ్యోతి స్వరూపుడు. జీవాత్మ పరమాత్మలోని ఒక భాగమే. జీవాత్మ కూడా అంతే స్వచ్చతతో ప్రకాశించుచున్నది. కానీ మనము చేసిన పాప పుణ్య కర్మానుసారం జీవాత్మ మాయ, కర్మ, అహంకారం అను త్రిదోషములతో కప్పబడి అందకారములో ప్రకాశరహితముగా ఉన్నది. దైవ అనుగ్రహముతో జీవాత్మ త్రిదోషముల నుంచి విముక్తి పొందిన, ఆత్మ సాక్షాత్కారం, ఆపై పరమాత్మ దర్శనం సిద్ధించును. 


దైవమును ఎక్కడ, ఎటుల పూజింపవలెను?



ఆ పరమాత్ముని సృష్టిలో అన్నీ దైవ స్వరూపాలే! ప్రతి జీవిని ప్రేమపూర్వకంగా ఆదరించవలెను. మనిషితోపాటు అన్ని జీవులను ప్రేమించగలగాలి. ఏ ప్రాణమునైనా  తమ ప్రాణమని భావించి, ఆ ప్రాణికి చూపు ప్రేమాదరణలను మించిన పూజ లేదు. ఆ పరమాత్మ మన నుంచి ఆశించేది అదే!

దైవం కొలువై ఉన్న ప్రతి జీవి, ప్రతి శరీరం ఆలయమే. ఆ ఆలయములో ప్రేమ అనే పూజ నిత్యం జరుగునెడల దైవ సాక్షాత్కారం తప్పక సిద్ధించును.  

దైవమును ఎలా చూడగలము?


భగవంతుడు ప్రతి అణువులోనూ ఉన్నాడని మన వేదములు చెప్పుచున్నవి. అణువణువునా విశ్వమంతా నిండి ఉన్న పరబ్రహ్మ ప్రతి జీవి లోనూ ఉన్నాడని గ్రహించి అన్ని జీవులయందు ప్రేమ, జీవకారుణ్యములతో  ఉన్న, ఆ దేవుడు అతి శులభముగా మనము గ్రహించునట్టుగా మనకు చేరువు కాగలడు.

" మానవ సేవే మాధవ సేవ " అని అన్నారు.

మానవ సేవే కాదు ప్రతి జీవిని అదే ప్రేమతో సేవించినచో భగవంతుని కృపకు తప్పక పాత్రులము కాగలము. అందువలనే హిందూ ధర్మము నందు ప్రతి జీవికి ఒక ప్రాధాన్యం ఇచ్చి దేవతలుగా, దైవ వాహనములుగా వాటిని భక్తీ తో ఆరాధించుచున్నాము.

ప్రేమ, కరుణ, దయ. ఈ మూడు సూత్రాలే దైవానుగ్రహమునకు ముఖ్య సాధనములు. అన్ని జీవులయందు మనము చూపించు ప్రేమయే జీవకారుణ్యము. పరమాత్ముడు మనపై చూపించు ప్రేమయే అనుగ్రహం/దైవక్రుప.

దేవునిని చూడవలెననిన ఆ పరమాత్ముని కృప కావలెను. ఆయన కృప లేనిదే అణువైనా కదలదు. ఆయన క్రుపను పొందుటకు, జీవకారుణ్యమే ఏకైక సాధన.

" జీవకారుణ్యమే మోక్షానికి మార్గము "

" అన్ని ఆత్మలయందు ఆ పరమాత్ముని చూడవలెను "

"ప్రతి జీవాత్మ పరమాత్మ స్వరూపమే అని గ్రహించవలెను "