Thursday, February 26, 2015

నిత్య జీవనం - సత్య జీవనం

సర్వశక్తి గల పరమాత్మ యొక్క ఉనికి రెండు అంశములలొ శాశ్వతముగా కలదు. మనము ఏదైతే బాహ్య ప్రపంచమున చూచి అనుభవించుచున్నామో అది ఆయన వెలుపలి అంశ. ఈ ప్రపంచము యొక్క కారణ ప్రభావములే ఆ పరమాత్ముని అంతర్గత అంశ. ఈ రెండు అంశలూ శాశ్వతమైనప్పటికీ, వేలుపలిది ఎప్పుడూ కనిపించునదిగానూ మార్పు చెందునదిగానూ, అంతర్గతమైనది కళ్ళకు కనిపించని మార్పులేనటువంటిదిగానూ ఉన్నది. ఆ పరమాత్ముని శక్తి అంతరాంతరమునుండి నిత్యం అన్నింటినీ వ్యక్త పరచి, లయపరచి తిరిగి సృష్టించుచూ ఉన్నది. మానవుడు తన ఇంద్రియ, తర్క, భౌతిక, యాంత్రిక జ్ఞానములతో తన బాహ్యాంతరంగములలో ఏది నిజమో తెలుసుకొనలేక సతమతమౌతున్నాడు. విజ్ఞానము మరియు అన్ని తత్త్వశాస్త్రములు ఈ రెండింటిలోనూ తమ ప్రయత్నములను చేయుచూ సత్యమును గ్రహించుటకు ప్రయత్నించుచున్నది. విజ్ఞాన శాస్త్రజ్ఞులు తమ ప్రయత్నముతో చంద్రుడు మరియు ఇతర గ్రహాల వరకు వారి పరిశోధనను కొనసాగించుచూ నక్షత్ర మండలమునకు చేరుకోనుచున్నారు. ఆధ్యాత్మికవేత్తలు, తత్వవేత్తలు మరియు యోగులు అంతర్ముఖులై ఆ పరమాత్ముని దివ్య శక్తిని అనుభవించుచున్నారు.

శాశ్వతమైన ఆత్మ యొక్క ఈ అంతర్ముఖ అనుభవముతో ఆ పరమాత్ముని రెండు అంశముల గురించిన జ్ఞానము వెలుగులోనికి వచ్చినది.

అణు శాస్త్రము విద్యుదయస్కాంత శక్తి ద్వారా కొంత అణు శక్తిని కనుగొనగలిగినది. కానీ ఇది సంపూర్ణమైన దైవ శక్తి కాదు. భౌతిక అణువు యొక్క కేంద్రము నుండి ప్రాణశక్తి వెలువడినప్పుడు, ఆ అణువు చుట్టూ భౌతిక శరీరము ఏర్పడును. ఆ ప్రాణశక్తితో పాటూ, ఇంద్రియ జ్ఞానములూ అభివృద్ది చెంది మనసు, బుద్ధి సృష్టించబడును. ఈ బుద్ధికి తత్త్వ జ్ఞానము అనుగ్రహించబడి మానవుడు తన బాహ్యము మరియు అంతరంగములలోని సత్యమును అన్వేషించుచున్నాడు. ఇక్కడ గ్రహించవలసినది పైన చెప్పబడిన అన్ని జ్ఞానములు, శక్తులు ఒక అణువు యొక్క కేంద్రము నుండి వెలువడినదే.



ప్రాణశక్తిని వెలువరించే ఆ అణువు మానవ దేహములో శిరస్సు మధ్యన ఆ మానవుని జీవిత కాలము అంతయూ ప్రకాశించుచూ ఉండును. ఆ అణువు యొక్క ప్రకాశము మరియు ప్రాణశక్తిని ఒక దివ్య శక్తి నియంత్రించుచున్నది. యోగులు, ఋషులు తమ తపో ఫలములతో దానిని తెలుసుకొని, అదియే ఆత్మ అణువు, ఆత్మ అని భాహిర్గతపరిచారు. ఈ ఆత్మ అణువే పరమాత్మ యొక్క శాశ్వత నివాసము. ఈ ఆత్మ అణువే జీవాత్మగానూ  పరమాత్మగానూ ఉన్నది. అనునిత్యమూ సర్వాంతర్యామిగా పరమాత్మ ఈ అణువునుండి ప్రపంచమునంతయూ పరిపాలించుచున్నాడు.

పైవిషయమునుండి ఈ ఆత్మాణువే పరమాత్ముని శాశ్వత నివాసము అని గ్రహించుచున్నాము. సర్వాంతర్యామి అగు ఆ పరమాత్మ అన్నింట తన ఉనికిని ప్రదర్శించుచున్నాడు. మానవుడు  అంతర్ముఖుడై పయనించినపుడే దీనిని గ్రహించగలడు.

పరమాత్మ తప్ప ఇక ఏదీ లేదు. నిత్యమూ అంతరంగమున మార్పు చెందక మరియూ బాహ్యమున మార్పు చెందుచూ ఉన్నది ఆ పరమాత్మయే. అందువలనే, మానవుని లోని ఆత్మ మరియు శరీరము ఆ పరమాత్ముడు తనను తాను వ్యక్త పరచుకొనిన విషయములే. ఇప్పటివరకూ మానవుడు తన జీవితము అనిత్యమైనదిగా ఊహించుకుంటున్నాడు. ఒక యోగ తర్కవాది కూడా తనకున్న ఆత్మ జ్ఞానముతో తాను ఒక ఆత్మనని, ఆత్మ జ్ఞానము పొంది ముక్తి చెందుట కొరకే ఈ భౌతిక దేహం తనకు ఇవ్వబదినదని అది అశాస్వతమని అనుకొనుచున్నాడు.

ఈ ఆత్మాణువు, జీవాత్మ మరియు పరమాత్మకు ఒక్కటే. ఉన్నతమైన దివ్య ఆత్మ అనుభవములలో, జీవాత్మ, పరమాత్మ, అనగా దైవం, మానవుడు ఒక్కటే. కానీ జీవునిలోని ఆత్మ అహంకారం, కర్మం, మాయ అను త్రిదోషములతో కప్పబడిఉన్నది. దీనిని జయించి ఆత్మసాక్షాత్కారం ఆపై పరమాత్మ సాక్షాత్కారం పొందవలెను.  ఇంద్రియ జ్ఞానము గల జీవితమును పరిశుధమైన దైవ జీవనముగా మార్చుకొని, స్వచ్చమైన ప్రేమ కలిగి జీవించవలెను. ఆ సర్వశక్తి గల పరమాత్ముని కృపతో ఈ దైవ మానవుడు నిత్య జీవితమును పొంది జీవించును.

పరమాత్ముని నిత్య జీవితం మానవునికి గల దివ్య హక్కు. ఈ దివ్య హక్కును గురించి ఎరుగక, దానిని విస్మరించడం దైవ సంకల్పం కాదు.

మరణము మానవుని అంతము కాదు. మరణములో భౌతిక శరీరము మాత్రమే నశించును. భౌతిక మరణానంతరం ఆత్మ వేరొక శరీరమును ఎంచుకొని మళ్ళీ పుట్టును. ఆత్మ తన భౌతిక కాయమును వదిలి వేరొక శరీరములో మళ్ళీ పుట్టుటకు కొంత కాలముఆలస్యమగును. ఆ కాలము మన కర్మానుసారం నిర్ణయింపబడును. ఆ మధ్య కాలమున ఆత్మ, పుణ్యాత్మ అయినచో వారి శిష్యులు, అనుచరులు, భక్తులను దీర్ఘకాలము వరకు రక్షించుచూ, మార్గనిర్దేశం చేయుచూ  ఉండును. కానీ, ఈ విధముగా ఒకరు ఉన్నతమైన నిత్య జీవనము పొందలేరు. దేహమును వదిలినచో మళ్ళీ జననము తప్పదు. ఇదే పునరపి జననం పునరపి మరణము.

పరమాత్మను దర్శించి పరమానందముతో మరణము లేని నిత్య జీవితం పొందగలడు. చిరంజీవి అయి జీవించగలడు. మరణ రహిత మరియు ఆనంద జీవనం మానవుని లక్ష్యము. ఈ జీవితం మానవుని ఆత్మ/అంతర్గతమునుండి తన ప్రయాణమును మొదలుపెట్టును. ప్రపంచములోని అన్ని మార్గములు బోధించు ఆత్మజ్ఞానమును పొంది ఆపై మరణమును జయించి భౌతిక నిత్య దేహమును పొంది చిరంజీవులుగా జీవించుటయే పరమాత్మ సంకల్పము.

" వేదములలో మరణమును జయించి నిత్య జీవనం పొందుటను గురించి చెప్పబడి ఉన్నది. "
- శ్రీ జ్యోతి రామలింగ స్వామి

మరణమును జయించి నిత్య జీవనం పొందుట గురించి శ్రీ రామలింగ స్వామి వారి గ్రంధములు మనకు బోధించుచున్నవి. 

Monday, February 16, 2015

నాలుగు దశలు

మన జ్ఞానులు మానవుడు దైవత్వమును పొందుట కొరకు నాలుగు దశలను నిర్దేశించినారు.

అవి,

         1. చర్య
         2. క్రియ
         3. యోగము
         4. జ్ఞానము

1. చర్య :

చర్య అనునది పరిశుభ్రముగా  స్నానము ఆచరించి, ఆలయమునకు వెళ్లి దైవ దర్శనం మరియు ఇతర పుణ్య కార్యక్రమములు చేయుట.

ఆలయ దర్శనం మొదటి దశ. దైవమును గూర్చి తెలియని చిన్నారులకు దైవమును పరిచయము చేయుట. దైవమునకు వివిధ రూపములను ఏర్పరిచిరి. వాటికి పురాణ గాధలు, ఉత్సవములు ఏర్పరిచి, ఆ దైవ తత్వము మనకు సులభముగా అర్థముగుటకు కృషి చేసిరి.

వారు రూపొందించిన ప్రతి విషయమునకు ఒక తత్వము కలదు. మానవ శరీరమునే ఆలయముగా నిర్మించిరి. దైవ స్వరూపములలో, పురాణ గాధలలో తత్వమును, జ్ఞానమును ఉపదేశించిరి. మానవుడు ఈ సమాజములో జీవించుటకు కొన్ని మంచి నియమములను నిర్దేశించిరి.

2. క్రియ:

మానవుడు అంతరంగమున తాను అభివృద్ధి చెందినపుడు, ఆలయమునకు వెళ్లి ప్రార్థించుటకనిన ఇంకనూ దైవమును సమీపించాలన్న ఆకాంక్ష పెరుగును. అప్పటివరకు ఆలయములో భక్తునికి, భగవంతునికి మధ్య అర్చకుడు అని ఒకరు ఉన్నారు. భక్తుడు తాను చెందిన పరిపక్కువత కారణముగా తానే స్వయముగా పూజ చేయవలెనని తానే కీర్తనలు పాడి, తన దైవమునకు స్వయముగా తానే సేవలను చేయవలెను అనే కోరిక కలుగును.

భక్తుడు తన గృహమున తన ఇష్ట దైవము యొక్క ప్రతిమను ప్రతిష్టించి తన మనసునకు తోచిన విధముగా పూజలు చేసి ఆనందించును. కీర్తనలు, స్తోత్రములు పాడి పరవశించును. భగవంతునికి భక్తునికి మధ్య వేరొకరు రావడం ఈ స్థితిలో తాను అంగీకరించడు.

మొదటి దశలో అన్ని పుణ్యక్షేత్రములను దర్శించి, పుణ్య నదులలో స్నానములు ఆచరించి, ప్రార్థించిన భక్తుడు, రెండవ దశలో పుణ్య క్షేత్రములు దర్శించి ప్రార్థించుటను తగ్గించి, తానే స్వయముగా పూజలు చేయుటకు ఆశక్తి చూపును. అభిషేకం, ఆరాధన, అలంకారం, యజ్ఞం, హోమం మొ అనేక క్రియలలో నిమఘ్నమై ఆనందించును. దీనినే క్రియ దశ అని అందురు.

3. యోగం:

మూడవ దశ యోగం. మొదటి దశలో ఆలయమును దర్శించి, ప్రార్థించిన భక్తుడు, రెండవ దశలో తానే పూజలు, హోమములు చేసిన కర్మ సాధకుడు, ఇంకనూ కొంచెం ఆలోచనా జ్ఞానము పెరిగినప్పుడు, మనము శిల్పములను, లోహములనే ఇప్పటి వరకు పూజించుచున్నాము. మన పూర్వీకులచే సాక్షిగా నిర్ధేశించబడినవే కదా ఇవి అని ఆలోచించునప్పుడు, వాటిని, వాటిని వివరించు, వివరింప జేయు గురువులను అన్వేషించును.

మొదటి తరగతిలో బాగా చదివి ఉత్తీర్ణులైన వారు రెండవ తరగతికి పంపబడుతారు. అక్కడనూ బాగా అభ్యసించి ఉత్తీర్ణులైనచో, మూడవ తరగతికి పంపబడుతారు. ఈ విధముగా భగవంతుడు, తన భక్తుడికి తరువాతి దశలను అనుగ్రహిస్తాడు.

మూడవ దశ చేరి, తగు దిశ తెలియక సంచరించు వాడు, ప్రాణాయామం మొదలగు యోగములను చేసి ప్రయత్నించును. పంచ భూతములలో ఒకటైన వాయువును గూర్చి అనేక యోగ సాధనములు చేయును. తీవ్ర వైరాగ్యము కల వారికి కొన్ని సిద్ధులూ ప్రాప్తించును.

మానవుడు  భక్తునిగా, కర్మ సాధకునిగా, తరువాత యోగిగా అగును.

4. జ్ఞానం:

చివరిగా, నాలుగవ దశ అయిన జ్ఞానం అంతిమ దశ. తాను ఎవరు అని సాధకుడు గ్రహించునది. ఇదే మనము పొందవలసినది అని పరిపూర్ణముగా గ్రహించవలెను.

ఆ పరమాత్మ వద్దకు మనలను తోడ్కొని పోవు మార్గము ఈ జ్ఞాన మార్గము.

భక్తునిగా, కర్మ సాధకునిగా, యోగిగా, పరిపక్వం చెందినవాడు, అంతిమముగా, ఆ పరమాత్మను తన లోనే దర్శించి, అనుభూతి చెంది, స్పష్టత పొంది తనను తాను తెలుసుకొని, సన్మార్గమున పయనించి ఆ పరమాత్మలో లీనమగుట మరణమును జయించుట - దేహము నశింపకుండుట - జనన మరణములను చక్రము నుండి విముక్తి పొంది నిత్య చిరంజీవులుగా జీవించవలెను. మరణమును జయించి అమరత్వమును పొందుటయే మానవుని లక్ష్యము.

చర్య          -      దేహ శుద్ధి , ఆలయ దర్శనము
                        భక్తుడు, దాశ మార్గము

క్రియ         -      అష్టాంగ పూజా విధానములను తానే స్వయముగా చేయుట
                        కర్మ సాధకుడు, సత్త్పుత్ర మార్గము

యోగము  -      ప్రాణ వాయువుని బంధించి సాధన చేయుట
                        యోగి, సహ మార్గము

జ్ఞానము    -      తాను ఎవరినో గ్రహించి, పరమాత్మ సాక్షాత్కారం పొంది, చిరంజీవులుగా నిత్యం జీవించడం
                        జ్ఞాని, సన్మార్గము 



అందరూ, మళ్ళీ జన్మించని వరము ఇవ్వమని ఆ భగవంతుడిని ప్రార్థించుదురు. ఇప్పటి వరకూ వచ్చిన మహానుభావులు అందరూ మరు జన్మ అనునది లేకుండా వరము ప్రసాదించమని కోరుకున్నారు. కానీ, వడలూరు శ్రీ జ్యోతి రామలింగ స్వామి, ఆ పరమాత్మ యందు మరణము లేని నిత్య జీవితమును ప్రసాదించమని కోరెను. మనము ఇది వరకే పుట్టి ఉన్నాము. ఈ జీవితము సమాప్తి చెందిన తరువాతనే కదా మరు జన్మ, మళ్ళీ పుట్టుట సంభవించును. ఈ జీవితమునే నిత్య జీవితముగా, మరణము లేని జీవితముగా చేసిన యెడల, మళ్ళీ పుట్టుట, మరు జన్మ గురించి ఆలోచించుట అనునది అవసరము లేదు. అందువలనే అందరికన్నా ఒక స్థాయి పైకెళ్ళి ఆ పరమాత్మ వద్ద మరణము లేని జీవితం, అమరత్వమును ప్రసాదించమని ప్రార్థించెను. తన ఒక్కడికి కాక, ఈ మానవ జాతి అంతయూ  దీనిని పొందవలెనని భగవంతుడిని ప్రార్థించెను. ఆ మహా పురుషుని కరుణా హృదయమునకు మనము ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉండవలెను.

చర్య, క్రియ, యోగం, జ్ఞానం అను ఈ దశలు, ఒక్కొక్కటి నాలుగు భాగములుగా విభజింపబడి, 16 దశలుగా శాస్త్రములు చెప్పుచున్నవి.

1.   చర్యలో చర్య
2.   చర్యలో క్రియ                       - చర్యలో ముక్తి సాలోక పదవి
3.   చర్యలో యోగం
4.   చర్యలో జ్ఞానం

5.   క్రియలో చర్య
6.   క్రియలో క్రియ                       - క్రియలో ముక్తి సామీప పదవి
7.   క్రియలో యోగం
8.   క్రియలో జ్ఞానం

9.   యోగములో చర్య
10. యోగములో క్రియ                 - యోగములో ముక్తి సారూప పదవి
11. యోగములో యోగం
12. యోగములో జ్ఞానం

13. జ్ఞానములో చర్య
14. జ్ఞానములో క్రియ                   - జ్ఞానములో ముక్తి సాయుచ్య పదవి
15, జ్ఞానములో యోగం
16. జ్ఞానములో జ్ఞానం

" ముక్తి అనునది ముందగు సాధనము
  సిద్ధి అనునది నిత్య అనుభవము "       - శ్రీ జ్యోతి రామలింగ స్వామి

 శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారు, ఆయనకు జీవులపై గల కరుణచే, 13 వ దశగా ఉన్న జ్ఞానములో సరియ నుండి మనకు బొధించిరి. అనగా ఏ స్థాయి లో ఉన్నవారైననూ ఈ 13 వ దశ నుండి వారి జ్ఞాన సాధనమును కొనసాగించవచ్చు. జ్ఞానము పొందుటకు అభిరుచి, ఆశక్తి ఉన్న వారు ఎవరైనా ఈ 13 వ దశలోనికి ప్రవేశించుటకు అర్హులే అని స్వామి వారు మన అందరినీ ఆహ్వానించుచున్నారు.




Sunday, February 8, 2015

దేవాలయములు మనకు ఏమి సూచిస్తూ ఉన్నది?

ఆత్మ సాధన లో మనము ముందు తెలుసుకోవలసినది "నేను ఎవరిని?" అని. నేను ఎవరు అని తెలుసుకొనునదే జ్ఞానం. జీవాత్మయగు తనను తెలుసుకొనిన వాడే, ఆ పరమాత్మను తెలుసుకొనగలడు.

ప్రతి అణువులోనూ ఉన్న ఆ పరమాత్మ మన దేహమంతయూ వ్యాప్తి చెంది ఉన్నాడు. మన శరీరములోని ఒక్కో అంగములోనూ ఒక్కో శక్తీ రూపములో వ్యాప్తి చెంది ఉన్నాడు. దీనినే మన పూర్వీకులు బాహ్య ప్రపంచములో వివరింపదలచారు. 

మనలోని ఆ పరమాత్మను బాహ్యములో  భావన చేసి, ప్రార్థించుటకు, ఒక్కో తత్వానికి, శక్తికి, ఒక్కో రూపమును ఇచ్చి ఆ రూపములను దేవతలుగా సృష్టించిరి. ఆ దేవతల కొరకు అనేక దేవాలయములను, ఇతిహాస పురాణములను ఏర్పరచిరి.  ఇందు మూలముగా నిజమును గ్రహించి, జ్ఞానమును పొందుటకు మార్గమును చూపించిరి. 

దేహమే ఆలయము:

మనలోని పరమాత్మను తెలుసుకొని, ఆ పరమాత్మను పొందదలచి, మన శరీరమునే ప్రతిరూపముగా ఉంచి, దేవాలయములను నిర్మించిరి. 


అనగా, పై చిత్రములో చూపించబడినట్టుగా, మన పాదములనే ప్రవేశ గోపురముగా, పది వ్రేళ్ళు ఆ గోపురము పై ఉన్న  కలసములుగా, పురుష అంగం, మూలాధార చక్ర స్థలం ధ్వజస్థంబముగా చెప్పబడినది. నాభి బలి పీటము, పై కడుపు నంది. నంది అనగా మన ఆహారమును జీర్ణము చేయి శక్తి. మన ముఖములోని నోరు, గర్భగుడి లోనికి ప్రవేశ ద్వారము. 

" మన శరీరమంతటికీ శిరస్సే ప్రథానం. " - జ్ఞానుల వాక్కు 

ఆ శిరస్సు మధ్యలో, ప్రకాశవంతముగా, జ్యోతి స్వరూపుడై ఆ పరమాత్మ కొలువున్నాడు. ఇదే మూల స్థానమని పిలువబదుచున్నది. ఈ కారణము వల్లనే శిరస్సు ప్రథానమని ఉపదేసించిరి. శిరస్సు మధ్య కొలువై ఉన్న ఆ పరమాత్మ, మన దేహమంతయూ వ్యాప్తి చెంది ఉన్నాడు. ఆ పరమాత్మ కొలువై ఉన్న ప్రదేశమునే మూలస్థానము, గర్భ గుడి అని చెప్పబడినది. 

ఏ శివాలయములోనైననూ, కుడి ప్రక్కన విఘ్నేస్వర సన్నిధి, ఎడమ ప్రక్కన సుబ్రహ్మణ్య (ఆరు ముఖ) సన్నిధి, ఇంకనూ ముందు భాగమున, ఎడమ వైపున శక్తి (అమ్మవారి) సన్నిధి ఉండును. 

మన దేహములో ఛాతియందు, కుడి వైపున ఐదు తలలతో కూడిన నాడి ఒకటి  కలదు. ఇదే పంచముఖ విఘ్నేశ్వరుడు, ఎడమ వైపున ఆరు తలలతో ఉన్న నాడి కలదు. ఇది మన శరీరములో ఉన్న 72,000 నరములకూ ప్రధానమైనది. ఇదే ఆరు ముఖం (సుబ్రహ్మణ్యం) అని చెప్పబడినది. 

మన ఛాతి యందు ముందు భాగమున, ఎడమ వైపున ఉన్నది హ్రుదయము. ఇది మన శరీరములోని చెడు రక్తమును శుధ్ధి చేసి అన్ని అవయవములకూ రక్తమును ప్రవహింపచేసి అన్ని అవయవములూ సక్రమముగా పని చేయుటకు శక్తిని ఇచ్చును. అందువలనే అమ్మవారిని శక్తి రూపముగా మనము ఆరాధించుచున్నాము. రక్తపు రంగు ఎరుపు కనుక ఆ శక్తిని ఎరుపు రంగులో  సూచిస్తున్నాము. ఆ కారణము చేతనే, అమ్మవారికి కట్టు చీర సైతం ఎరుపు రంగు, అక్కడ ప్రసాదముగా ఇవ్వబడుచున్న కుంకుమ ఎరుపు రంగుతో ఉన్నవి. మన శరీరములో ప్రవహించు రక్తము శక్తి స్వరూపం. శక్తి లేనిదే మనము లేము. ఇందు కారణము చేతనే అనేక మంది శక్తిని ఉపాసించుచున్నారు. 

మహా విష్ణువు హృదయ స్థానములో మహా లక్ష్మి కొలువై ఉన్నది అని చెప్పుట కూడా ఈ కారణము చేతనే !!

Saturday, February 7, 2015

మానవ జన్మ పొందినందుకు మనం తెలుసుకోవలసినది ఏమిటి, పొందవలసినది ఏమిటి?

మానవ జన్మ దైవత్వమును పొందుటకొరకే అని మనము గ్రహించవలెను.

సృష్టి ప్రారంభమునుండి ఒక జ్ఞానము గల ప్రాణి నుండి ఇప్పుడు ఆరు జ్ఞానములు అనగా ఆరవ జ్ఞానమగు ఆలోచనా జ్ఞానము గల ప్రాణి వరకు పరిణతి చెంది ఉన్నాము.


ఈ పరిణామక్రమములో ఇంకనూ పైకెదిగి దైవత్వమును పొందవలెను. ఇప్పటి వరకూ ఈ పరిణామ క్రియను ప్రకృతి తానే స్వయముగా చేయుచూ వచ్చుచున్నది. పరిణామక్రమములో పై మెట్టు ఎక్కి పరిపూర్ణత చెందవలెను. ఈ బాధ్యత ప్రకృతి మనకు అప్పగించినది. మానవునికి సర్వ స్వతంత్రమును ప్రసాదించి పరిణామములో ఉన్నత శిఖరాలను అధిరోహించుట లేక ఇక్కడే ఉండిపోవుట, లేదా ఇంకను పాప కార్యములు చేసి నీచ స్థితులకు పోవుట మన చేతిలో ఉన్నది. 

పరిణామక్రమములో ఉన్నత స్థితులకు వెళ్ళడం అనగా, దైవత్వమును పొందడమే! అనగా, దైవానికి మరణము లేదు. దైవత్వమును పొందినచో మనమూ మరణమును జయించి చిరంజీవులుగా జీవించగలము. ఇది సాధ్యమేనని ఎందరో మహానుభావులు, దివ్య పురుషులు ఇదివరకే రుజువు చేసి ఉన్నారు.  శ్రీ ఆంజనేయ స్వామి ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నారు. మహావతార్ బాబాజీ రెండు వేల సంవత్సరములుగా హిమాలయములలో ఉన్నారు. ఆయన దర్శనం పొందిన ఆయన శిష్యులు ఎందరో వారి అనుభవములను పంచుకుంటున్నారు. తమిళనాడు లోని సిద్ధపురుషులు ఈ అమరత్వమును గురించి వివరించి ఉన్నారు. ఇవి వారి గ్రంథముల నుండి మనకు తెలియుచున్నది. ఈ అమరత్వ విద్య ప్రస్థావన మన వేదము, ఉపనిషత్తులలో కూడా ఉన్నది. ముఖ్యముగా కటోపనిషత్తులో ఈ విద్యను గురించి దీర్ఘముగా చర్చించబడి ఉన్నది. చీనా దేశమునకు చెందిన తావోలు కూడా ఈ అమరత్వమును గురించి ప్రస్థావించి ఉన్నారు. 


అతి సమీప సమయములో అనగా 19 వ శతాబ్దములో తమిళనాడులోని చిదంబరమునకు సమీపములో వడలూరు అను దివ్య క్షేత్రములో శ్రీ జ్యోతి రామలింగ స్వామి మరణమును జయించి త్రిదేహ సిద్ధి అనగా, శుద్ధ, ప్రణవ, జ్ఞాన జ్యోతి దేహములు పొంది, అమరత్వము అందరికీ సాధ్యమే అని చెప్పినారు. మానవులందరికీ ఇది సాధ్యమే అని నిరూపించినారు.

                                                         శ్రీ రామలింగ స్వామి



మానవ జన్మకు సార్థకత ఏమిటి?


పరమాత్మ కృపకు పాత్రులై, ఆ పరమాత్మను దర్శించి, దైవత్వమును పొందుట లోనే ఈ మానవ జన్మకు సార్థకత ఉన్నది. అది లేక ఎన్ని సాధనములు చేసి ఎంతటి గొప్ప విషయములను సాధించినా వ్యర్థమే!

మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణ ఇతిహాసములు, సకల శాస్త్రములు ఏమి బోధిస్తున్నవి?


వేదములు, సకల శాస్త్రములు మనకు బోధించునది పరమాత్మ ఒక్కటే. ఆ పరమాత్మ ప్రేమ మూర్తి, జ్యోతి స్వరూపుడు. జీవాత్మ పరమాత్మలోని ఒక భాగమే. జీవాత్మ కూడా అంతే స్వచ్చతతో ప్రకాశించుచున్నది. కానీ మనము చేసిన పాప పుణ్య కర్మానుసారం జీవాత్మ మాయ, కర్మ, అహంకారం అను త్రిదోషములతో కప్పబడి అందకారములో ప్రకాశరహితముగా ఉన్నది. దైవ అనుగ్రహముతో జీవాత్మ త్రిదోషముల నుంచి విముక్తి పొందిన, ఆత్మ సాక్షాత్కారం, ఆపై పరమాత్మ దర్శనం సిద్ధించును. 


దైవమును ఎక్కడ, ఎటుల పూజింపవలెను?



ఆ పరమాత్ముని సృష్టిలో అన్నీ దైవ స్వరూపాలే! ప్రతి జీవిని ప్రేమపూర్వకంగా ఆదరించవలెను. మనిషితోపాటు అన్ని జీవులను ప్రేమించగలగాలి. ఏ ప్రాణమునైనా  తమ ప్రాణమని భావించి, ఆ ప్రాణికి చూపు ప్రేమాదరణలను మించిన పూజ లేదు. ఆ పరమాత్మ మన నుంచి ఆశించేది అదే!

దైవం కొలువై ఉన్న ప్రతి జీవి, ప్రతి శరీరం ఆలయమే. ఆ ఆలయములో ప్రేమ అనే పూజ నిత్యం జరుగునెడల దైవ సాక్షాత్కారం తప్పక సిద్ధించును.  

దైవమును ఎలా చూడగలము?


భగవంతుడు ప్రతి అణువులోనూ ఉన్నాడని మన వేదములు చెప్పుచున్నవి. అణువణువునా విశ్వమంతా నిండి ఉన్న పరబ్రహ్మ ప్రతి జీవి లోనూ ఉన్నాడని గ్రహించి అన్ని జీవులయందు ప్రేమ, జీవకారుణ్యములతో  ఉన్న, ఆ దేవుడు అతి శులభముగా మనము గ్రహించునట్టుగా మనకు చేరువు కాగలడు.

" మానవ సేవే మాధవ సేవ " అని అన్నారు.

మానవ సేవే కాదు ప్రతి జీవిని అదే ప్రేమతో సేవించినచో భగవంతుని కృపకు తప్పక పాత్రులము కాగలము. అందువలనే హిందూ ధర్మము నందు ప్రతి జీవికి ఒక ప్రాధాన్యం ఇచ్చి దేవతలుగా, దైవ వాహనములుగా వాటిని భక్తీ తో ఆరాధించుచున్నాము.

ప్రేమ, కరుణ, దయ. ఈ మూడు సూత్రాలే దైవానుగ్రహమునకు ముఖ్య సాధనములు. అన్ని జీవులయందు మనము చూపించు ప్రేమయే జీవకారుణ్యము. పరమాత్ముడు మనపై చూపించు ప్రేమయే అనుగ్రహం/దైవక్రుప.

దేవునిని చూడవలెననిన ఆ పరమాత్ముని కృప కావలెను. ఆయన కృప లేనిదే అణువైనా కదలదు. ఆయన క్రుపను పొందుటకు, జీవకారుణ్యమే ఏకైక సాధన.

" జీవకారుణ్యమే మోక్షానికి మార్గము "

" అన్ని ఆత్మలయందు ఆ పరమాత్ముని చూడవలెను "

"ప్రతి జీవాత్మ పరమాత్మ స్వరూపమే అని గ్రహించవలెను "


దైవం ఎక్కడ ఉంది?



" ఇందు గలడు అందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు
   ఎందెందు వెదకిన అందందే గలడు "  

" సర్వం శివమయం " అంటారు . 

అంతటా నిండి ఉన్న పరమాత్మ మనలోనూ ఉన్నాడు. మనలో ఉన్న ఆ దైవం ప్రతి జీవిలోనూ ఉన్నాడని గ్రహించవలెను. ప్రతి జీవిలోనూ ఉన్న ఆ పరమాత్మను దర్శించుచూ  మనలో ఉన్న దైవాన్ని తెలుసుకొని, దర్శించి, పరిపూర్ణత చెందడమే మన జ్ఞాన  సాధన. 

Friday, February 6, 2015

దేవాలయములకు వెళ్ళుట వలన ఏమి పొందుతున్నాము?

దేవాలయం = దేవ + ఆలయం

దేవుని యొక్క ఆలయం. అనగా దైవం నివసించు ఆలయం. భగవంతుడు ప్రతి అణువులోనూ ఉన్నాడని మన వేదములు చెప్పుచున్నవి. అణువణువున ప్రపంచమంతా నిండి ఉన్న పరబ్రహ్మ ప్రతి జీవిలోనూ ఉన్నాడని గ్రహించవలెను. ప్రతి జీవిలోనూ ఉన్న పరమాత్మ మనలోనూ ఉన్నాడు.
ఆ పరమాత్మ నివశించు మన శరీరమునే ఆలయము, దేవాలయము అని చెప్పుచున్నాము. మన శరీరమునే బాహ్య ప్రపంచమున దేవాలయముగా ఒక కట్టడముగా మన పూర్వీకులు చూపించిరి.

దేవాలయమునకు వెళ్లి మనము తెలుసుకొన వలసినది అక్కడ ప్రతిరూపముగా చూపబడిన దైవము మన శరీరములో కొలువై ఉన్నాడని, దైవత్వమును పొందుటకు మనము ఏ విధముగా కృషి చేయవలెనని తెలుసుకొనవలెను. ఈ జ్ఞానమునే మనము దేవాలయములలో పొందుచున్నాము. జ్ఞానము పొందుటయే మన ఏకైక లక్ష్యముగా దేవాలయమును సందర్సించినచో అన్ని రహస్యములూ స్పష్టంగా తెలియవచ్చును. అది లేక ప్రతిరూపమైన ఆలయమును ఆడంబరమునకై ఏ దైవ సంకల్పమూ లేక సందర్శించినచో మనము దేవాలయమునుండి పొందవలసిన ఏ జ్ఞానమూ పొంద లేము.

మనము దైవమును ఎందుకు పూజించుచున్నాము?

దైవం/పరబ్రహ్మం  కరుణా సముద్రుడు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ తానే అయి మనులను ఎల్ల వేళలా  రక్షించుచున్నాడు. ఈ జీవన సాగరములో కష్ట సుఖములు రెండూ కలిసి వచ్చుచున్నది. మనులను ఎల్ల వేళలా రక్షించుచున్న ఆ దైవం, కరుణా మూర్తి మనులకు ఎందుకు కష్టములను కలిగించుచున్నాడు?

కర్మ సిద్ధాంతం ప్రకారం మనము చేసిన మంచి, చెడులే పాప పుణ్యములుగా, సుఖ దుఃఖాల రూపములో మనము అనుభవించుచున్నాము.

అటులైన మనము చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదు. మరి భగవంతుడిని పూజించుట ఎందుకు? మన కష్టాలను తొలగించమని కోరడమెందుకు?

భగవంతుడిని పూజించుట, ప్రార్థించుట, ఆరాధన చేయుట, నామ సంకీర్తన చేయుట, జపము మొ.. అన్నీ భక్తి అను పదమునకు నిర్వచనాలె!

భక్తి అనునది ఒక విధమైన ప్రేమ గా అభివర్ణించవచ్చు. భగవంతుడు ప్రేమ సాగరుడు. ఆయనను భక్తి అను ప్రేమ తోనే పొందగలం.

ఎటులనిన, మనము ఒకరి పట్ల తప్పు చేసితిమి అనగా, ఆ తప్పును సరిదిద్దుకొనుటకు, మనము పస్చాత్తాపులై వారి మీద ప్రేమను చుపించినచో, వారు మన ప్రేమకు ముగ్ధులై మన తప్పులను క్షమించెదరు. ఇదే విధముగా మనము భగవంతుని యందు ప్రేమ, భక్తి తో ప్రార్తించినచో, ఆయన మన తప్పులను క్షమించి మనకు సుఖ సంతోషములను ప్రసాదించును.

పుణ్య పాప కర్మలు రెండూ నిర్మూలించబడినపుడే జ్ఞానము సిద్ధించి దైవత్వమును పొందెదము.